ఏ పార్టీలో అయినా అధిష్టాన దేవతల భజన కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే నిన్నటి మొన్నటి వరకు సోనియా, రాహుల్, ఎప్పుడో చనిపోయిన ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీల భజన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుండేది. భాజపాలో అటువంటి సంస్కృతి లేనపట్టికీ, నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వంపై, పార్టీపై పూర్తి పట్టు సాధించడంతో భాజపాలో కూడా మోడీ భజన కార్యక్రమం మొదలయిపోయింది. దేశంలో ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేపట్టినా అది మోడీ వలననే జరుగుతోందని చెపుతూ కేంద్రప్రభుత్వం అంటే మోడీ, మోడీయే కేంద్రప్రభుత్వం అన్నట్లు మాట్లాడుతున్నారు. డిల్లీ, బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో భాజపా విజయం సాధించి ఉండి ఉంటే, ఆ భజన కార్యక్రమం ఇంకా ఉదృతంగా సాగిఉండేది.
ఈ మోడీ భజన కార్యక్రమంలో అందరి కంటే ముందుండే వ్యక్తి కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడి ప్రజలకు దేవుడిచ్చిన వరం. ఆయన నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది” అంటూ మోడీ భజన చేసారు. భజనపై పూర్తి పేటెంట్ హక్కులున్నట్లు భావించే కాంగ్రెస్ పార్టీ ముందుగా స్పందించి, వెంకయ్య నాయుడు మాటలని ఆక్షేపించింది. ఈ విషయం చివరికి ఆర్.ఎస్.ఎస్.చెవిలో కూడా పడటంతో, అది కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యక్తి పూజలను ప్రోత్సహించవద్దని భాజపా అధిష్టానానికి సూచించింది.
దానితో కంగు తిన్న వెంకయ్య నాయుడు తన భజన చరణాలకి సవరణ విడుదల చేసారు. “ప్రధాని నరేంద్ర మోడి ప్రజలకు దేవుడిచ్చిన వరం అని నేను అనలేదు. ప్రజలే ఆవిధంగా అనుకొంటున్నారని నేను అన్నాను. నా మాటలను మీడియా వక్రీకరించింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో ఒక వర్గం నా మాటలను వక్రీకరించి వాటిపై కూడా రాజకీయం చేయాలనీ ప్రయత్నించింది,” అని చెప్పుకొచ్చారు. ఈ సవరణ తరువాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి ప్రజలకు దేవుడిచ్చిన వరమో కాదో ఆయననే మళ్ళీ అడిగి తెలుసుకోవలసి ఉంటుంది.