రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీని గురించి దేశ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండవచ్చు కానీ.. విధానాలన్నీ ఆరెస్సెస్వే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆరెస్సెస్ వ్యవహారాలన్నీ ఎప్పుడూ గుంభనంగా సాగుతూంటాయి. బీజేపీ ఎక్కడ బలపడినా దానికి ఆరెస్సెస్ వేసిన పునాదులే కారణం. త్రిపుర అయినా.. మరో చోట అయినా ఇప్పటి వరకూ జరిగింది ఇదే. అయితే కారణం ఏమిటో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆరెస్సెస్ పునాదులు అంత బలంగా లేవు.
తెలంగాణలోనూ ప్రత్యేకంగా వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం కాస్త వెనుకబాటుతోనే ఉంది. బీజేపీలో ఎదిగిన నేతలు ఆరెస్సెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. కానీ వారెవరూ విజయవంతమైన నాయకులు కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో ఆరెస్సెస్‌ను మరింత వేగంగా విస్తరింప చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత, విభాగ ప్రచారక్ భైఠక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా వచ్చారు. ఆరెస్సెస్‌ను విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆరెస్సెస్ కార్యకలాపాలు… ప్రధానంగా ఆలయాలు, స్కూళ్ల కేంద్రంగా సాగుతూ ఉంటాయి.
తెలంగాణలో దాదాపుగా ప్రతీ మండలంలో ఆరెస్సెస్‌కు చెందిన పాఠశాల ఉంటుంది. కానీ ఏపీలో వాటి సంఖ్య చాలా పరిమితం. ఇప్పుడు… మూలాల నుంచి ఆరెస్సెస్‌ను బలపరచాలన్న లక్ష్యంతో మోహన్ భగవత్ ఉన్నారు. దేశంలో బీజేపీ ఒక్క శాతం ోట్లు కూడా తెచ్చుకోలేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది. ఆ పరిస్థితి నుంచి అధికారం దిశగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆరెస్సెస్ సాకారం చేయాలని ప్రయత్నిస్తోంది. ఎంత వరకూ సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి..!