బీఎల్ సంతోష్ ను కేసీఆర్ సర్కార్ టార్గెట్ చేసినందుకు ఆరెస్సెస్ తాము బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడానికి ఆరెస్సెస్ తో పాటు అన్ని అనుబంధ సంఘాలు కీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్‌లోనే ఆరెస్సెస్‌తో పాటు వివిధ హిందూ సంఘాలు సమావేశమై… రాజకీయంగా వెళ్లకుండా.. అధికారం ఉందని బీఎల్ సంతోష్ ను జైలుకు పంపాలనుకున్నారని.. కేసీఆర్ ను ఇక సానుకూలంగా చూసే పరిస్థితి ఉండకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
తప్పుడు ఆరోపణలు చేసినందుకు పర్యవసానాలు తప్పక అనుభవించాల్సిందేనని ఫామ్ హౌస్ కేసు విషయంపై తెలంగామ సర్కార్ ను బీఎల్ సంతోష్ హెచ్చరించారు. ఆ హెచ్చరికల పర్యవసానాలు ఎలా ఉంటాయో కానీ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికి బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా తమ శక్తియుక్తులు మొత్తం వెచ్చించాలని నిర్ణయంచినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. బీఎల్ సంతోష్ ఆరెస్సెస్ పెద్ద మనిషి. ఆరెస్సెస్ తరపున బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. ఆయన ఎలాంటి పదవులు తీసుకోరు. కేవలం పార్టీ కోసం పని చేస్తారు. అలాంటి తమ నేతను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని.. తాము ఎలా కామ్‌గా ఉండగలమని ఆరెస్సెస్ నేతలు చెబుతున్నారు.
బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలో విజయం సాధించినా.. ఆరెస్సెస్ పాత్రను ఎవరూ కాదనలేరు. పైకి కనిపించకుండా .. ఇంటింటి ప్రచారం చేస్తూ.. బీజేపీకి ఓటర్లుగా మార్చడంలో వీరి పాత్ర కీలకం. త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే దానికి కారణం ఆరెస్సెస్ ఏళ్ల తరబడి ప్రణాళికాబద్దంగా పని చేయడమేనని రాజకీయవర్గాలు నమ్ముతాయి. ఈ సారి తెలంగాణలో బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరెస్సెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆరెస్సెస్ ఓ నివేదిక రెడీ చేసుకుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించారు.
ఆరెస్సెస్ రంగంలోకి దిగితే.. బీజేపీ పని చాలా వరకూ సులువు అవుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ బీజేపీతోనే కాదు.. ఆరెస్సెస్ తోనూ తలపడాల్సి ఉందని..ఇదంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది.