బీహార్ లో బిజెపి అవమానకరమైన ఓటమి పై చర్చ జరగవలసిందే అన్న సీనియర్ల డిమాండుపై సంప్రదింపులు ప్రారంభించాలని ”అధిష్టానం” నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సీనియర్ నాయకులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో సమావేశమౌతారు. స్వయం సేవకుడైన రామ్ మాధవ్ ను ఆర్ ఎస్ ఎస్ ఎంపిక చేసి బిజెపిలోకి పంపించిందంటారు. సంస్ధాగత వ్యవహారాలు చూడటం తప్ప వ్యక్తిగత ప్రచారానికి దూరంగా వుండే రామ్ మాధవ్ కి పార్టీలో ట్రబుల్ షూటర్ అనే గౌరవం వుంది.
ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధికారాలను కేంద్రీకృతం చేసుకుని ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్ నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితోపాటు శత్రుఘ్న సిన్హా… మరి కొంతమంది ఎంపీలు బాహాటంగా విమర్శిచడం అమిత్ షాలపై పెరుగుతున్న అసమ్మతిని దృవపరుస్తోంది.
మోదీ, అమిత్ షా ఒక పథకం ప్రకారం అద్వానీ, జోషి వంటి సీనియర్లను పక్కనపెట్టిన విషయం పాత కథే. ఈ అవమానానికి ఎదురుదెబ్బ అన్నట్టు ఈ పాతతరం నాయకులు మంగళవారం రాత్రి ఘాటైన పదజాలంతో విడుదల చేసిన ప్రకటన పార్టీ నాయకత్వాన్ని కంగు తినిపించింది. ఆ వెంటనే మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ లు – ప్రధాని మోదీ, అమిత్ షాలకు అనుకూలంగా ప్రకటన విడుదల చేసినప్పటికీ, ఫలితం లభించలేదు. తమ ఒత్తిడిని పెంచే చర్యలలో భాగంగా అద్వానీ నివాసంలో పార్టీ సీనియర్లు బుధవారం రాత్రి మరోసారి సమావేశమై జవాబుదారితనాన్ని నిర్ధారించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
సీనియర్లతో మాట్లాడటానికి కొంతమంది మంత్రులు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయి. ప్రధాని మోదీని గట్టిగా సమర్థించే మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ పాతతరం నాయకత్వంపై ప్రతి విమర్శలు కురిపిస్తున్నా ఫలితం దక్కటంలేదు.
ఈ నేపధ్యంలో రామ్ మాధవ్ రంగప్రవేశాన్ని ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వానికి నాందిగా బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
బీహార్ ఒటమికి బాధ్యులను నిర్ధారించే విషయం ఎలావున్నా ”ఈ అసమ్మతి” అమిత్ షాకు రెండోసారి బిజెపి జాతీయ అధ్యక్ష పదవి రాకుండా నిరోధించే అవకాశాలు బలపడుతున్నట్టు కనిపిస్తోంది.
రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గంలో చేరటంతో ఏర్పడిన ఖాళీలో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడైన అమిత్ షా పదవీ కాలం డిసెంబర్లో ముగుస్తుంది. రెండవసారి ఆయనను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలన్న మోదీ ఆలోచనలకు సీనియర్ల డిమాండు బ్రేక్ వేసేలా వుంది. లోక్‌సభ ఎన్నికలల్లో సాధించిన ఘనవిజయాన్ని చూసి మోదీ ప్రతిపాదనను వ్యతిరేకించలేక అమిత్ షా అభ్యర్థిత్వానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు, సమీకరణలు మారిపోయినందున అమిత్ షాకు రెండవసారి పదవి లభించటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రధాని విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన తరువాత సీనియర్ల డిమాండ్ మేరకు పార్టీ ఓటమిపై సమీక్ష జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.