ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే పెద్ద విషయం లేదనుకోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పరోక్షంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఆరెస్సెస్ మెల్లగా అసంతృప్త స్వరం బహిరంగంగా వినిపించడం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో రెండేళ్లలో మోదీ వయసు 75 ఏళ్లు దాటుతుంది. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్ల తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కానీ, మోదీ మాత్రం.. ఈ ఐదేళ్లు కూడా పీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారు. బీజేపీ బలహీనపడటంతో పార్టీలో, ఆర్ఎస్ఎస్లో మోదీకి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే మోదీపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరింత మంది ఆయనకు వ్యతిరేకంగా వాయిస్ పెంచుతారు.
కేంద్రంలో టీడీపీ, జేడీయూ సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు బీజేపీకి షాక్ ఇస్తారో చెప్పలేం. రెండేళ్లలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఫలితాలు బట్టి ఆయన మరోసారి కూటమిని మార్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అంటే మోదీకి 75 ఏళ్లు వచ్చే నాటికి దేశంలో రాజకీయాలు మారిపోతాయి. అందుకే ఆరెస్సెస్ కూడా ఆయనకు చెక్ పెట్టేలా ఇప్పటి నుంచే కొత్త వ్యూహం రెడీ చేస్తున్నట్లుగా ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.