అసోంలోని ముస్లిం సోదరులను ఇప్పుడో భయం కుదిపేస్తోంది. ఆ భయం ఒక వ్యాక్సిన్ వల్ల ఏర్పడింది. దీనికారణంగా గౌహతిలోని ఆ పాఠశాలల్ని నిర్ణీత గడువుకంటే ముందే మూసేయాల్సి వచ్చింది. భారతీయ జనతా నేతృత్వంలోని అసోం రాష్ట్ర ప్రభుత్వం జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి నిరోధానికి వ్యాక్సిన్ ఇవ్వాలని సంకల్పించింది. పని కూడా మొదలుపెట్టేసింది. ఈ వ్యాక్సిన్ను మర్మాంగం చుట్టూ ఇస్తారని వదంతి పుట్టింది. అంతే.. ముస్లిములలో సంతానోత్పత్తిని తగ్గించేసేందుకు ఏదో వ్యాక్సిన్ ఇస్తున్నారని గగ్గోలు పుట్టింది. అంతే, ముస్లింలు స్కూళ్ళకు వెళ్ళి, పిల్లలను ఇళ్ళకు తీసుకెళ్ళిపోయారు. 80శాతం స్కూళ్ళు ఖాళీ అయిపోయాయి. స్కూళ్ళలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదీ నిర్వహించడం లేదని ఒక ఉపాధ్యాయుడు మనోజ్ సేనాపతి తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు జపాన్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధికి వ్యాక్సిన్లు ఇవ్వడం సర్వసాధారణమన్నారు. వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి వస్తే..తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేయమని కూడా స్పష్టంచేశారు. దీనిని కూడా తల్లిదండ్రులు నమ్మినట్లు కనిపించలేదు. ముస్లిములు తమ పిల్లలను స్కూలుకు పంపడం మానేశారు. హటిగావ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. నల్బరీ, మోరీగావ్, బొంగాయ్గావ్, కచ్చర్ జిల్లాల్లో 2010-2016 మధ్ కాలంలో జపాన్ ఎన్సెఫలైటిస్ కారణంగా 779 మరణాలు సంభవించాయి. మరిన్ని మరణాలను నిరోధించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని హిందూస్థాన్ టైమ్స్ కథనం. ఈ కార్యక్రమానికి ప్రచారం ప్రారంభం కాగానే ముస్లిములలో గగ్గోలు ప్రారంభమైంది. ముస్లిము జనాభాను అదుపుచేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని అనుమానాలు రేకెత్తాయి. తమ పిల్లలలో సంతానోత్పత్తిని నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ను ఉద్దేశించారనీ, దానిపేరు కూడా ఆర్ఎస్ఎస్ వ్యాక్సిన్ అనీ ప్రచారం చేస్తున్నారనీ సేనాపతి అంటున్నారు. అసోంలో ముస్లిం జనాభా రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తోంది. తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని పార్టీలు చూస్తుంటాయి. 2001లో 30.9 శాతం ఉన్న ముస్లిం జనాభా 2011నాటికి 34.2శాతానికి పెరిగింది. దేశంలోనే ఇది అత్యధిక పెరుగుదల. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనడానికి వీల్లేదని అసోం ప్రభుత్వం ఇటీవలే జనాభా విధానాన్ని సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ వ్యాక్సిన్ అంటూ రేగిన దుమారాలపై అసోం పోలీసులు దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు. అబద్ధాలను ప్రచారం చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు.
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో కుటుంబ నియంత్రణ లక్ష్యం సిద్ధింపజేసుకోడానికి ముస్లింలకు విచక్షణా రహితంగా శస్త్ర చికిత్సలు చేసేయడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని బట్టీ వ్యాక్సిన్లకు పేర్లు పెట్టేసి, ముస్లింలను భయభ్రాంతులను చేస్తుండడం వెనుక ఉన్న శక్తుల్ని చాకచక్యంగా కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అసోం ఇప్పటికే బంగ్లా నుంచి ముస్లింల చొరబాట్ల సమస్యను ఎదుర్కొంటోంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి