రవితేజ 75వ చిత్రానికి రంగం సిద్ధమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భాను దర్శకత్వం వహిస్తారు. ఈ రోజు ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో రవితేజ లక్ష్మణ్ భేరి పాత్రలో కనిపించనున్నాడు. ”ఆదాయం .. చెప్పన్ తీయ్, రాజ పూజ్యం అన్ లిమిటెడ్, వ్యయం.. లెక్క చేయన్, అవమానం జీరో” అంటూ తన రాశి ఫలాలు కూడా ఉగాది స్టైల్ లో చెప్పుకొన్నాడు రవితేజ. దీన్ని బట్టి.. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ అని అర్థమైపోతోంది. రవితేజలోని మాస్ కోణాన్ని పూర్తిగా వాడుకొంటూ, ఈ కథ చేశారని టాక్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ ‘ధమాకా’ చిత్రానికి భీమ్స్ ఇచ్చిన బాణీలు బాగా దోహదం చేశాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబినేషన్ సెట్టయ్యింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. సంక్రాంతి లిస్టులో చాలా సినిమాలున్నాయి. విశ్వంభర, తండేల్, రాజా సాబ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పొంగల్ బరిలోనే నిలిచాయి. ఇప్పుడు రవితేజ కూడా ఈ పోటీలో దిగిపోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి క్లాప్ కొట్టనున్నారు. పూర్తి వివరాలు ఇంకొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.