ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెపై వెనక్కి తగ్గేదే లేదని భీష్మించాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో సమ్మె తప్పదని సంఘాలు అంటున్నాయి. కార్మికులు సమ్మెకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం కేసీఆర్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న సంస్థ, తాజా సమ్మెతో మరింతగా నష్టపోతుందని సీఎం అన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇదే చివరి సమ్మె అవుతుందనీ, సమ్మె చేస్తే ఆర్టీసీ నిలువుగా ముక్కలు కావడం ఖాయమనేసరికి.. కార్మికుల్లో కొంత టెన్షన్ మొదలైంది. దీంతో రవాణా శాఖ మంత్రి ఆహ్వానం మేరకు మంతనాలు జరిపారు.
సమ్మె తేదీని ప్రకటించడం ఏకపక్ష నిర్ణయమని మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆర్టీసీకి మరింత నష్టాలే తప్ప, ప్రయోజనం ఉండదన్నారు. అయితే, తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండా సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరితే ఎలా అంటూ టి.ఎమ్.యు. ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీకి నష్టాలు తగ్గాలంటే ప్రభుత్వం సొమ్ము ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కష్టాలు తీర్చడం ప్రభుత్వం చేతులోనే ఉందన్నారు. జీతాలు పెంచుతామన్న హామీ ఇస్తే తప్ప, సమ్మె విరమించే ప్రసక్తే లేదని సంఘాలు స్పష్టం చేశాయి.
కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే వెంటనే ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టూ సమాచారం. ప్రభుత్వాదేశాలను కాదని సమ్మెకు దిగితే అడ్డుకునేందుకు సిద్ధమౌతున్నారు. సమ్మె ప్రకటన వెలువడితే.. ఆ వెంటనే సమ్మెకు మద్దతు ఇస్తున్న నేతలూ, వారి వెంట నడిచే కార్మికులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న కార్మిక సంఘాల గుర్తింపును ఎలా రద్దు చెయ్యొచ్చనే ఆలోచనలో కూడా సర్కారుకు ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె జరగనీయకూడదనే పట్టుదలతో ప్రభుత్వం ఉందనేది స్పష్టమౌతోంది. అంతే పట్టుదలతో సమ్మె చేసి తీరతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలూ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
తనకు అనుగ్రహం వస్తే వరాలు కురిపించడంలో కేసీఆర్ ఏమాత్రం వెనకాడరు. ఇటీవలే రైతులూ ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. తనకు ఆగ్రహం వస్తే… ఇదిగో, ఇలానే కఠినవైఖరితో ఉంటారని మరోసారి చెప్పకనే చెబుతున్నారు..!