ఆర్టీసీ కార్మిక యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ … ఓ రకంగా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ. ఉద్యమం సమయంలో.. ఈ యూనియన్ బలోపేతం అయింది. గుర్తింపు తెచ్చుకుంది. దీనికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కార్మిక యూనియన్ ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. పదకొండో తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన టీఎంయూనే సమ్మెకు దిగుతూండటంతో ఇతర సంఘాలు కూడా… అదే బాటలో పయనించనున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సంఘ నేతల దూకుడైన ప్రకటనల వల్లో ఏమో కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్… సీరియస్‌గా ఉన్నారు. ఆర్టీసీలో సమ్మె నోటీసు అనే ప్రస్తావన రాగానే … మండిపడ్డారు. రూ.2,800 కోట్ల నష్టాల్లో ఉంటే వేతనాలను పెంచాలని అడుగుతారా అంటూ ఆగ్రహించారు. బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని, సమ్మె చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఐదు రూపాయల వేతనం కూడా పెంచే పరిస్థితి కార్పొరేషన్‌కు లేదంటూ కరాఖండిగా చెప్పేశారు. ఉద్యోగులతో సన్నిహితంగా ఉండే కేసీఆర్.. ముఖ్యంగా తన పార్టీకి అనుబంధ సంస్థ లాంటి టీఎంయూ విషయంలో ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారో చాలా మందికి అర్థం కాలేదు. అదే సమయంలోఇతర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై మాత్రం సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగసంఘాల నేతలు కూడా ఫైరయ్యారు. రాజకీయ నేతల వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం – ఆర్టీసీ మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.
టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ప్రస్తుతం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కొనసాగుతున్నారు. సమ్మె చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక.. ఆయనకు సమాచారం లేకుండా ఉంటుందంటే.. ఎవరూ నమ్మలేకపోతున్నారు అశ్వత్థామరెడ్డి.. నేరుగా కాంగ్రెస్ నేతల్లా.. ముఖ్యమంత్రికే కౌంటర్ ఇస్తున్నారు. . మరి హరీష్ రావు.. ఎందుకు కార్మిక సంఘం నేత ఆశ్వత్థామరెడ్డికి సర్ది చెప్పడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి కాబోతున్న బంగారు తెలంగాణలో తొలి ఆర్టీసీ సమ్మె… పదకొండో తేదీ నుంచి జరగనుంది.