ఆర్టీసీ ఉద్యోగులు.. జనవరి ఒకటో తేదీ నుంచి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. అంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీకి వారికి ఏపీ సర్కార్ ఖాతా నుంచి జీతాలు అందుతాయి. ప్రస్తుతం వారికి ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే సౌకర్యాలన్నీ.. వారికి లభిస్తాయి. ఉద్యోగులు చాలా కాలంగా చేస్తున్న ఈ డిమాండ్ కు ఉన్న అడ్డంకులన్నింటిని జగన్మోహన్ రెడ్డి సర్కార్… చట్టం ద్వారా అధిగమిచింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీలో సభ్యుల అభినందల మధ్య ప్రకటించారు.
అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు… ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు తెచ్చిన చట్టం వల్ల విలీనం ఆలస్యం అయిందని.. కొత్త చట్టం తేవాల్సి వచ్చిందన్నారు. జనవరి 1 లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని రవాణా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇలా చేయడం వల్ల.. ప్రభుత్వంపై ఏటా రూ. మూడు వేల కోట్ల భారం పడుతుందన్నారు. అయినప్పటికీ.. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్నారు.
ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సర్కార్.. అలాంటి అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తున్నారు. జనవరి ఒకటికి విలీనం పూర్తి చేసి.. ఫిబ్రవరికి… ప్రభుత్వ ఖాతా నుంచి వారికి జీతాలు చెల్లించనున్నారు.