ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు కూడా అందుతున్నాయి. అది వారి సుదీర్ఘ డిమాండ్. ప్రభుత్వం సాకారం చేసింది. కానీ.. అప్పుడే వారు నిరసనలకు దిగుతున్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఉద్యోగులు నిరాహారదీక్షలు చేయనున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 128 డిపోల వద్ద ఇవి జరుగుతున్నాయి. ఆర్టీసీలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలభిషేకం చేసి.. నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే వీరు ఎందుకు నిరసనలకు దిగుతున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం.
అయితే ఉద్యోగులు మాత్రం… ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల .. సమయానికి జీతాలు వస్తాయనే నమ్మకం పెరిగింది కానీ.. ఆర్టీసీలో ఉన్నప్పుడు… ఉన్న సౌకర్యాలన్నింటినీ తొలగించారని… మండి పడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి.. ఉన్న సౌకర్యాలను తొలగించారని.. కార్మికులు ్ంటున్నారు. ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ రూట్లలో స్కూల్ బస్సులు తిప్పుకునేందుకు అనుమతిస్తూ.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని..ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఉద్యోగులకు బీమా, పెన్షన్ అందించే ట్రస్టుల్ని… మూసేశారు. వారిని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు ఎన్ని చేసినా… సంతృప్తి ఉండదని.. ఇంకా ఇంకా కావాలంటూ ఉంటారని.. అధికార పార్టీ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత … ఉద్యోగులుగానే చూస్తారని..వారికి ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి… ఆర్టీసీలో ఉన్న సౌకర్యాలు కూడా ఉండాలని కోరుకుంటే… ఎలా అని అంటున్నారు. అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే సాధ్యం కాదంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి..!