ఒంగోలులో టీడీపీ మహానాడు జరిగినప్పుడు ఆర్టీసీని అద్దె బస్సుల కోసం టీడీపీ సంప్రదించింది. కానీ ఎక్కడా ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు. అంతే కాదు.. రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి.. ప్రైవేటు వాహనాలు, స్కూల్ బస్సులు కూడా ఇవ్వకుండా కట్టడి చేశారు. టీడీపీ మహానాడు సభకు వచ్చినవారంతా వ్యక్తిగత వాహనాతోనే వచ్చారు. అప్పుడు ఆర్టీసీకి భారీ ఈవెంట్లు లేవు. పండుగలు లేవు.
ఇప్పుడు ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు వందల బస్సులు కేటాయిస్తున్నాయి. పొరుగున ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. వందల బస్సులను ఏర్పాటు చేసి .. జనాన్ని ఖమ్మం సభకు తరలిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్వయంగా సహకరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు పండుగ తర్వాత ప్రజలు మళ్లీ పనులకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సుల అవసరం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధపడి..బీఆర్ఎస్ సభకు బస్సుల్ని కేటాయించారు.
ప్రభుత్వ సహకారం బీఆర్ఎస్ కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని.. రాజకీయవర్గాలు ఈ కారణంగానే అంటున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ కు.. వైసీపీ సపోర్టుగా ఉంటుందని.. జాతీయ స్థాయిలో అవసరాల కోసం బీజేపీతో ఉన్నా… రేపు ఎన్నికల తరవాత కేసీఆర్ తోనే వైసీపీ వెళ్తుందని.. అందుకే ఇలాంటి సహకారం అందిస్తారని అంటున్నారు, అదే సమయంలో పవన్ కల్యాణ్ ఇబ్బందికరంగా మారారు కాబట్టి..ఆయనకు బలం ఉన్న వర్గాన్ని బీఆర్ఎస్ నేతల ద్వారా చీల్చాలని అనుకుంటున్నారని బహిరంగంగానే తెలిసిపోతోందని అంటున్నారు.
రాను రాను బీఆర్ఎస్, వైసీపీల మధ్య స్నేహం.. బహిరంగమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.