ఏదో అనుకుంటే ఏదో అయిందనే చందంగా తయారయ్యయి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీవితాలు. ‘అనుకున్నామని జరగవు అన్ని …అనుకోలేదని ఆగవు కొన్ని ‘ అన్నట్లుగా కార్మికులు అనుకున్నవి జరక్కపోగా అనుకోనివి జరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. సమ్మెకు దిగినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని వారు ఊహించలేదు. ఇప్పుడు అందరి చూపూ లేబర్ కోర్టు మీద ఉంది. అది ఇచ్చే తీర్పును బట్టి ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏమిటో తెలిసిపోతుంది. హైకోర్టు 5.100 ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ కేసీఆర్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే సమయంలో కార్మికుల సమ్మె విషయాన్ని లేబర్ కోర్టు తేల్చాలని, సమ్మె చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా? అనేది లేబర్ కోర్టు చెప్పాలని ఆదేశించింది.
దీంతో కార్మికుల నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇక అప్పటినుంచి ‘విధుల్లో చేరతాం మహాప్రభో’ అంటూ బస్సు డిపోలకు పరుగులు తీశారు. కాని యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో డిమాండ్లు తీర్చాలని ఆందోళన చేసిన కార్మికులు ఇప్పుడు తమను విధుల్లో చేర్చుకోవాలని ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఇదో విచిత్రం. రూట్ల ప్రయివేటీకరణకు హైకోర్టు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సమ్మె ముగియలేదని, కొనసాగుతూనే ఉందని జేఏసీ కన్వీనర్ అశ్వద్థాతామ రెడ్డి చెప్పాడు. సుప్రీం కోర్టుకు పోతామంటున్నాడు. లేబర్ కోర్టు తీర్పు చూసుకున్నాక దాన్నిబట్టి సుప్రీం గడప తొక్కుతారేమో. సుప్రీం కోర్టుకు వెళితే ఇప్పట్లో తేలదని, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ ఇదివరకే చెప్పారు.
ఇప్పటికే కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు ఆత్మహత్యలు చేసకోగా, కొందరు గుండెపోటుతో చనిపోయారు. రెండు నెలలుగా జీతాలు లేవు. కొందరు కూలీలుగా మారారు. కొందరు కులవృత్తులు చేసుకుంటున్నారు. ఇంతకంటే నష్టం ఉంటుందా? అనుకుంటున్నారేమో. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని కేసీఆర్ మొదటినుంచీ అంటున్నాడు. సమ్మ చట్టవిరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరాడు. రూట్ల ప్రైవేటీకరణకు అంగీకరించిన కోర్టు సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించబోమని చెప్పింది. ఇదొక్కటే వారికి హైకోర్టులో ఊరట కలిగిన అంశం. సమ్మె విషయంలో హైకోర్టుతో ‘నో’ అనిపించుకున్న కేసీఆర్ లేబర్ కోర్టుతో ‘ఎస్’ అనిపించుకోవచ్చని ఎక్కువమంది ఊహిస్తున్నారు. అంటే సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే కార్మికులకు మరో దిక్కు లేదు. అప్పుడు సుప్రీం కోర్టుకు వెళతారేమో…!
మొత్తం ఆర్టీసీ రూట్లలో సగం ప్రయివేటుపరం అవుతాయి కాబట్టి సుమారు 50 వేల మంది కార్మికుల్లో సగంమందికి పనుండదు. ఆర్టీసీని పెద్ద గుదిబండగా చెబుతున్న కేసీఆర్ వారిని మోయలేడు కదా. కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) అమలు చేయడం ఖాయం. సమ్మె విరమించామని కార్మికులు చెబుతున్నారు కాబట్టి వీరిని విధుల్లో తీసుకున్నా సగంమంది ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాల్సిందే. లేబర్ కోర్టు తీర్పు తరువాత కార్మికుల భవిష్యత్తుపై క్లారిటీ వస్తుంది. వీఆర్ఎస్ అమలు చేయడానికి వీలుగా అధికారులు కార్మికుల సర్వీసు వివరాలు, వారికి చెల్లించాల్సిన నగదు ప్రయోజనాలు మొదలైనవాటిపై కసరత్తు ప్రారంభించారని సమాచారం. వీఆర్ఎస్ కారణంగా ఆర్టీసీపై ఎంత భారం పడుతుందనేది లెక్కలు వేసి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వబోతున్నారు.
కేసీఆర్ అనుకున్నవన్నీ జరిగితే ఆర్టీసీ వైభవం అంతరించిపోయినట్లే. ఈ సంస్థలో చాలా ఏళ్ల క్రితమే రిక్రూట్మెంట్లు ఆగిపోయాయి. ఇంక ముందు కూడా ఉండవు. కాలక్రమంలో పూర్తి ప్రైవేటీకరణ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. సమ్మె నేపథ్యంలో రెండు మూడుసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీయే లేదని చెప్పాడు. తెలంగాణలోనూ అదే పరిస్థితి రావొచ్చు. వీఆర్ఎస్కు ఎంతమంది ముందుకు వస్తారో, ఎంతమందిన ఇంటికి పంపుతారో చూడాలి.