ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు శనివారం నిర్వహించిన బంద్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రైవేట్ కేబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఆర్టీసీకి మద్దతుగా నిలిచారు. అయితే, ప్రభుత్వం తమని చర్చలకు ఆహ్వానిస్తే వెంటనే వచ్చేందుకు ఇప్పటికీ తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ సంఘాల నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి అలాంటి సంకేతాలేవీ లేవు. సోమవారం నుంచి విద్యా సంస్థలు కూడా తెరవాల్సిన అవసరం ఉంది కాబట్టి, పెద్ద ఎత్తున సిబ్బందిని రిక్ర్యూట్ చేసుకుని బస్సులు తిప్పాలనే ఆలోచనలోనే ఉన్నారు. అవసరమైతే వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నవారి సేవల్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి.. ప్రభుత్వం అనేకంటే, ఈ సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే తెర మీదున్నారు. ఇతర మంత్రులుగానీ, అధికారులుగానీ ఆయన ఆదేశాల్ని మాత్రమే పాటిస్తున్న పరిస్థితి.
బంద్ సక్సెస్ కావడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణను ఇవాళ్ల ప్రకటించబోతున్నాయి. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను ఇవాళ్ల ప్రకటిస్తామన్నారు. దీన్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 23న భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనీ, ఆయా పార్టీల జిల్లాల నేతలతో పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే చర్చించారనీ సమాచారం.
రెండోసారి కేసీఆర్ సీఎం అయిన తరువాత ఆయనకి వ్యతిరేకంగా ఇలాంటి భారీ నిరసన సభ జరగడం ఇదే ప్రథమం అవుతుంది. ప్రతిపక్షాలకు కూడా బాగానే పట్టు ఉంది అనే అభిప్రాయం కలిగించే అవకాశం ఈ సభతో వస్తుంది. అందుకే, విపక్ష పార్టీలన్నీ ఈ సభను సీరియస్ గానే తీసుకుంటున్నట్టు సమాచారం. 23న హైదరాబాద్ లో సభ, రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బంద్ సక్సెస్ కావడం కేసీఆర్ కి కొంత మైనస్ అయ్యే అంశమే. ఇప్పుడు హైదరాబాద్ లో నిరసన సభ అంటే… రాజకీయంగా అది కూడా కొంత ఇబ్బందికరమైందే అవుతుంది. దీన్నెల్లా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారో చూడాలి.