Rudrudu Movie review
తెలుగు360 రేటింగ్ : 1.5/5
గత పదేళ్ళుగా ‘కాంచన’ ఫ్రాంచైజ్ లోనే వుండిపోయారు లారెన్స్. ఆ సిరిస్ లో వచ్చిన అన్ని సినిమాలు విజయాలు సాధించడంతో మరో ప్రాజెక్ట్ గురించి అలోచించలేదు. అయితే మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నుంచి రుద్రుడు అనే వేరే సబ్జెక్ట్ వచ్చింది. కొత్త దర్శకుడు కతిరేషన్ దర్శకత్వం వహించిన రుద్రడు తెలుగు ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకున్నాడు ? మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ నే నమ్ముకొని వచ్చిన లారెన్స్ కు మరో విజయం దక్కిందా ?
రుద్ర (లారెన్స్) ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. అనన్య (ప్రియా భవానీ శంకర్) ని ప్రేమించి,పెళ్లి చేసుకుంటాడు. ఓ పాప పుడుతుంది. రుద్ర తండ్రి (నాజర్) స్నేహితుడి నమ్మి ఆరు కోట్లు మోసపోయి ఆ బాధతో చనిపోతాడు. రుద్ర తండ్రి చేసిన అప్పు వడ్డీతో సహా ఏడు కోట్లు అవుతుంది. అప్పులు వాళ్ళు ఇంటిపై పడతారు. తమకున్న బిజినెస్ అమ్మి మూడు కోట్లు అప్పు తీర్చి మిగిలిన అప్పు తీర్చడం కోసం విదేశాల్లో పనిచేయడానికి వెళ్తాడు రుద్ర. కొన్ని రోజుల తర్వాత అనన్య కూడా రుద్ర దగ్గరికి వచ్చేస్తుంది. హాయిగా కాలం గడుస్తున్న సమయంలో రుద్ర తల్లి ఇంద్రాణి (పూర్ణిమ భాగ్య రాజ్) కు అనారోగ్యం చేస్తుంది. దీంతో నిండు గర్భిణిగా వున్న అనన్య అత్తని చూడడానికి విదేశం నుంచి ఇండియా వస్తుంది. ఇంతలో తల్లి చనిపోయిందనే వార్త రుద్రకి అందుతుంది. ఇదే సమయంలో ఇండియా వచ్చిన అనన్య కనిపించకుండాపోతుంది. మరి అనన్య ఎక్కడి వెళ్ళింది ? రుద్ర తల్లి చావుకి అనన్య కనిపించకపోవడానికి కారణం ఏమిటి ? అనన్య ఆచూకీ రుద్ర తెలుసుకున్నాడా ? భార్య ఆచూకీ కోసం వెదుకుతున్న రుద్రకి ఎలాంటి నిజాలు తెలిశాయి ? అనేది మిగతా కథ.
రుద్రుడు కోసం దర్శకుడు ఎత్తుకున్న పాయింటే చిన్నదే అయినా మంచి పాయింట్ పట్టుకున్నాడు. ఒక మిస్టరీ థ్రిల్లర్ కి పనికొచ్చే పాయింటే అది. అయితే పాయింట్ బావుంటే సరిపోదు. ట్రీట్ మెంట్ బావుండాలి, అందులో కొత్తదనం చూపిస్తేనే అనుకున్న పాయింట్ ఎలివేట్ అవుతుంది.
కరుడుగట్టిన క్రిమినల్ భూమి (శరత్ కుమార్) ని భారీ ఎలివేషన్ తో పరిచయం చేసి కథని మొదలుపెట్టిన దర్శకుడు అంతకంటే భారీ ఫైట్ తో రుద్రని తెరపైకి తెస్తాడు. ఈ రెండు సీన్స్ తో ఇది భూమి, రుద్రల కథని అక్కడే అర్ధమైపోతుంది. సడన్ గా కట్ చేసి.. ఫ్యామిలీ, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, తండ్రి మోసపోవడం, విదేశాలకు వెళ్ళడం.. ఇలా ఒకొక్క సీన్ పేర్చుకుంటూ వెళ్లి మళ్ళీ రుద్ర, భూమి దగ్గరకి రావడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నాడు దర్శకుడు. దీంతో ఈ ప్రయాణం రొటీన్ సాగదీత గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ కూడా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో వుంటుంది.
సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. దర్శకుడు తను అనుకున్న పాయింట్ ఇదే. భూమి ఫ్లాష్ బ్యాక్, డబ్బులు సంపాయించడానికి అతడు ఎంచుకున్న మార్గం ఆసక్తికంగానే చూపించారు. ఇదే పాయింట్ తో ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ చక్కగా కుదిరేది. అయితే దిన్ని రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చూపించడానికే ప్రయత్నించాడు దర్శకుడు. ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు చాలా తెవిలిగా వుంటారు. వాళ్ళ ఆచూకీ కనుక్కోవడమే కష్టం. ఈ పాయింట్ ని తెలివైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని హోల్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాస్ ఫైట్స్ కే మొగ్గు చూపాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోయే రెండు భారీ ఫైట్లతో ఈ కథకు ముగింపు పలికాడు.
ఇందులో లారెన్స్ పాత్రకి రెండు కోణాలు వున్నాయి. ఐటీ ఉద్యోగిగా సాఫ్ట్ గా కనిపిస్తాడు. అంతలోనే కాంచన లారెన్స్ కూడా ప్రత్యేక్షమౌతుంటాడు. డ్యాన్సులు హుషారుగా చేశాడు. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడు. అయితే ఎమోషన్స్ సీన్స్ లో మాత్రం కాస్త శ్రుతి మించినట్లే అనిపిస్తుంది. ప్రియా భవానీ శంకర్ హోమ్లీగా కనిపించింది. ఆమె నటన కూడా బావుంది. శరత్ కుమార్ ది బలమైన పాత్రే కానీ రొటీన్ గా ట్రీట్ చేశారు. నాజర్, పూర్ణిమ, మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.
సాంకేతికంగా సినిమా డీసెంట్ గా వుంది. మంచి కెమరాపనితనం కనిపించింది. జీవీ ప్రకాష్ పాటలు ఓకే అనిపిస్తాయి. మొదటి పాట డ్యాన్స్ కి ప్రత్యేకం. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం యాక్షన్ ని ఎలివేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది.
మంచి పాయింట్ ని కూడా రొటీన్ మాస్ మసాలా సినిమాగా చూపించే కొన్ని సినిమాలు వస్తుంటాయి. రుద్రుడు కూడా అదే కోవలోకి వస్తుంది.