రుక్సార్ థ్రిల్లాన్.. హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా విజయాలేం రాలేదు. కాకపోతే.. గ్లామర్ తో నెట్టుకొస్తోంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో ‘దిల్ రూబా’ సినిమాలో నటించింది. వచ్చే వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. ‘దిల్ రూబా’ ట్రైలర్ లాంచ్‌లో ఫొటోగ్రాఫర్లపై కాస్త అసహనం ప్రదర్శించింది. ‘కంఫర్ట్ గా లేకపోయినా ఫొటోలు తీస్తారా.. ఇక్కడున్న అమ్మాయిలూ.. మీరు ఇందుకు అనుమతి ఇస్తారా’ అంటూ తన అయిష్టాన్ని వ్యక్తం చేసింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి.
అసలేం జరిగిందంటే.. ‘దిల్ రూబా’ ట్రైలర్ లాంచ్ సమయంలో.. ఫొటోగ్రాఫర్లు రుక్సార్‌ని కొన్ని పోజులు ఇవ్వమని అడిగారు. ఇది ఏ ప్రెస్ మీట్లో అయినా కామన్‌గా జరిగే వ్యవహారమే. హీరోయిన్లు వస్తారు, ఫొటోగ్రాఫర్లు ఫోజులు ఇమ్మంటారు. ఇదంతా పబ్లిసిటీలో భాగమే. కానీ రుక్సార్ ని అడిగినప్పుడు ఆమె సరిగ్గా స్పందించలేదు. ‘ఈ డ్రస్ లో నాకు కంఫర్ట్ ఉండదు.. వద్దు’ అని చెప్పింది. ఆ తరవాత వేదికపై గ్రూఫ్ ఫొటో తీస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్లు ఆమెను పక్కకు తప్పించారు. ‘మేం కూడా నిన్ను కవర్ చేయ్యం’ అన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. దాంతో రుక్సార్ అలిగింది. అదే విషయాన్ని బయటపెట్టింది.
ఫొటో గ్రాఫర్ల వెర్షన్ వేరేలా వుంది. ఇది వరకు కూడా రుక్సార్ ఇలానే ప్రవర్తించిందని, మీడియా వచ్చేది ఈవెంట్ ని కవర్ చేయడానికీ, పబ్లిసిటీ ఇవ్వడానికే అని, హీరోయిన్లకే కవరేజ్ వద్దని చెప్పినప్పుడు మాకూ వాళ్ల ఫొటోలు అవసరం లేదని చెబుతున్నారు.