‘పేటా’ నిర్మాత స్టేట్మెంట్లు ఇప్పుడు ప్రకంపనాలు సృష్టిస్తోంది. తమ సినిమాకి థియేటర్లు లేకుండా చేయడం పట్ల, తెలుగు చిత్రసీమలో నెలకున్న థియేటర్ల కబ్జా పట్ల ఆయన తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిజానికి పండగ పూట డబ్బింగ్ సినిమాలు విడుదల కాకుండా చూడాలన్న నియమం ఉండేది. దాన్ని.. రెండేళ్లు గట్టిగానే అమలు చేశారు. కానీ ఆ తరవాత.. దాన్ని మర్చిపోయారంతా. ఆ రూలు ఇప్పుడు చూపిస్తే… ‘పేటా’కి ఈ మాత్రం థియేటర్లు కూడా దొరకవు.
ఆ రూలు మాట ఎత్తకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. డబ్బింగ్ సినిమాలంటే ఇది వరకు చిన్న సైజు, మీడియం రేంజు నిర్మాతలే. ఇప్పుడు అలా కాదు. బడా నిర్మాతలు కూడా డబ్బింగ్ సినిమాలవైపు దృష్టి నిలిచారు. గతేడాది విడుదలైన ‘గ్యాంగ్’ యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది. అలాంటి సమయంలో.. ‘డబ్బింగ్ సినిమా’ రూలు ఎందుకు ఎత్తుతారు..? అంతకు ముందు కూడా అంతే. పండగల సీజన్లో డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అవన్నీ బడా నిర్మాతలు విడుదల చేసినవే. అందుకే ఇప్పుడు ఆ పాత రూలుని బయటకు తీసుకురావడం లేదు. ఒకవేళ ‘తెలుగు పండగ సీజన్లో డబ్బింగ్ సినిమాలు ఆడకూడదు’ అని గట్టిగా చెబితే.. ‘గత యేడాది గ్యాంగ్ ఎలా విడుదల చేశారు’ అనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకే.. ఈ విషయమై పెద్ద నిర్మాతలంతా మౌనంగా ఉన్నారు.
ఇప్పటికైనా మించి పోయిందేం లేదు. తెలుగులో ముఖ్యమైన సీజన్లలో డబ్బింగ్ సినిమాలు ఆడకూడదు అనే నిబంధన తీసుకురాగలిగితే… దానిపై గట్టిగా నిలబడగలిగితే, కొంతవరకూ థియేటర్ల సమస్యనీ, ఇలాంటి విమర్శల్నీ ఎదుర్కొనే వీలుంటుంది.