ఎంత పెద్ద హీరో అయినా, ఎంత అభిమానగణం ఉన్నా – వరుసగా మూడు ఫ్లాపులు, అందులోనూ డిజాస్టర్లూ వస్తే తట్టుకోవడం కష్టం. ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి ఇదే. 2019లో వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లుగా మిగిలాయి. కథానాయకుడు, మహానాయకుడు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ సినిమాలు సరిగా ఆడలేదని, బాలయ్యే మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. రూలర్ పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది.
ఈ సినిమాపై దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టాడు సి.కల్యాణ్. గత ఫ్లాపుల్ని దృష్టిలో ఉంచుకున్న బయ్యర్లు ఈ సినిమా కొనడానికి ధైర్యం చేయలేదు. అందుకే అడ్వాన్సులు తీసుకుని, సినిమాని వదిలేశారు. తొలి మూడు రోజుల వసూళ్లు చూస్తే రూలర్ భారీ నష్టాల్ని భరించకతప్పదని తేలిపోయింది. ఈ ఎఫెక్ట్ బోయపాటి శ్రీను సినిమాపై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. 2020 జనవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ఇప్పటికే బడ్జెట్ 70 కోట్లుగా ఖరారు చేశారు. బాలయ్యకు వరసగా ఫ్లాపులొచ్చాయి. బోయపాటి గత సినిమా వినయ విధేయరామ కూడా విమర్శల పాలైంది. ఆ సినిమాకీ నష్టాలే. ఇద్దరూ ట్రాక్ తప్పేశారు. అయితే… ఈ కాంబోకి ఉన్న క్రేజ్ వేరు. రూలర్లా బయ్యర్లు భయపడరు. కాకపోతే.. 70 కోట్లతో సినిమా తీస్తే థియేటరికల్ రైట్స్ కనీసం 80 కోట్లకైనా అమ్మాయి. ఆ స్థాయిలో బిజినెస్ జరిగే సత్తా.. ఈ కాంబోకి లేదు. అందుకే తప్పనిసరిగా… బడ్జెట్ కోత విధించాల్సివస్తుంది. ఈ విషయమై ఇప్పటికే బోయపాటిపై నిర్మాత ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బోయపాటి 15 కోట్లు తీసుకున్నాడు. బాలయ్యకు మరో పదిచ్చారు. అంటే పాతిక కోట్లు ఇక్కడే తేలిపోయాన్నమాట. మరో పాతికలో సినిమాని పూర్తి చేస్తే తప్ప – ప్రీరిలీజ్ కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం లేదు. మరి బడ్జెట్ తగ్గించమంటే బోయపాటి ఏమంటాడో..?