బాలకృష్ణ సినిమా అంటే రాజకీయాల వాడీ వేడీ ఉండాల్సిందే. తన సినిమాలో ఏదో ఓ రూపంలో, ఏదో ఓ చోట… పొలిటికల్ టచ్ ఇస్తుంటారు బాలయ్య. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన కొత్త సినిమా `రూలర్` ఇందుకు మినహాయింపు అనుకున్నారు. రాజకీయ అంశాలేం లేకుండా – ఫక్తు కమర్షియల్ సినిమాని తీస్తున్నారనుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్లోనూ, ట్రైలర్లోనూ పాలిటికల్ పంచ్‌లు లేవు. కానీ.. ఇప్పుడు `రూలర్` కొత్త ట్రైలర్ వచ్చింది. ఈసారి మాత్రం తనదైన వాడీ చూపించారు బాలయ్య.
ఓ చోట విలన్‌తో బాలయ్య `ఎలక్షన్ ఎలక్షన్కీ పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు` అనే డైలాగ్ విసిరారు. అంటే ప్రస్తుతం ఉన్న పార్టీకి, ప్రభుత్వానికీ ఇదో చురక అన్నమాట. అధికారం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అది మారుతుంది. రేపటి రోజు అధికారం మా చేతికి వస్తుందన్న పరోక్ష హెచ్చరిక ఈ డైలాగ్‌లో ఉందనుకోవాలి.
తొలి ట్రైలర్లానే ఇందులోనూ కమర్షియల్ ప్యాకేజీ కనిపించింది. బాలయ్య నుంచి ఆశించే డైలాగులు, యాక్షన్ షాట్లూ, ఆ చిలిపిదనం, భారీదనం ఇవన్నీ రంగరించారు.
అయితే ఓ చోట ప్రకాష్ రాజ్ `సామాన్యులు కూడా బందిపోటులుగా దారిదోపిడీ దారులుగా మారుతున్నారంటే దానికి కారణం.. ఆకలి. ముందు ఆ ఆకలిని చంపాలి` అంటాడు. కాకపోతే ఇక్కడ ఆకలిని తీర్చాలి అనాలి. ఆకలిని చంపాలి అనకూడదు. చంపాలి అంటే నెగిటీవ్ సెన్స్ వస్తుంది. పరుచూరి మురళి ఈ డైలాగ్‌ని ఏ సెన్స్‌లో రాశాడో మరి..