స్థానిక ఎన్నికలు నిర్వహించలనుకుంటున్న ఏపీ సర్కార్.. రూల్స్ మారుస్తూ..ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ పోటీ చేసే అభ్యర్ధులను భయపెడుతోంది. రాజకీయ ప్రత్యర్ధులపై ఈ ఆర్డినెన్స్ ద్వారా అనర్హత వేటు వేసేందుకు ప్రభుత్వానికి అధికారం వస్తూండటమే దీనికి కారణం. డబ్బులు, లిక్కర్ లను పూర్తిగా నిరోధించాలనే ధృక్పధంతో ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. డబ్బులు, లిక్కర్ పంచుతూ ఎన్నికల తరువాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు వేస్తామని, మూడేళ్లు జైలు శిక్ష కూడా వేయాలని చట్టంలో ఉంది. దీనిపై ఇతర రాజకీయ పార్టీల నేతలు అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు చట్టాన్ని వైసీపీ నేతలకు వర్తింప చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది స్థానిక ఎన్నికల్లో పట్టించుకునే అవకాశం లేదు. పూర్తిగా ఇతర పార్టీల నేతల్ని టార్గెట్ చేయడానికే.. ఈ చట్టం తెచ్చారని నమ్ముతున్నారు. డబ్బులు, లిక్కర్ వైసీపీ నేతలు పంచినా …అనర్హతా వేటు వేస్తారా.. అని .. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించడం… పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రస్తుతానికి ప్రభుత్వం… స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి ధీటుగా ఇప్పుడు.. ఫలితాలు సాధించాల్సి ఉంది. తమ పాలనకు ప్రజామోదం ఉందని నిరూపించాల్సిన పరస్థితి ఉంది. అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. దానిపై ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయని … ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. విపక్షం చెబుతోంది. ఇలాంటి సమయంలో.. అలాంటిదేమీ లేదని.. తాము ప్రజారంజక పాలన అందిస్తున్నామని.. నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో.. రాష్ట్రంలోని ప్రతి ఓటరూ తన అభిప్రాయాన్ని తెలుపనున్నారు. అంటే.. ఓ రకంగా అది రిఫరెండమే అవుతుంది. ఏ మాత్రం ఫలితం తేడా వచ్చినా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందనే అభిప్రాయం వస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా… అధికార పార్టీ వ్యూహాత్మకంగా రూల్స్ మార్చి..తమకు అనుకూలంగా చేసుకుని… పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు.. . విపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎన్నో ఆదర్శాలు చెప్పారు. ఇసుకలో అవినీతి అని..అక్రమ కట్టడాలు అని.. మరొకటి అని.. ఎన్ని చెప్పినా.. అన్నీ టీడీపీ నేతలను టార్గెట్ చేశారు కానీ..ఆ వ్యవస్థల్లో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు ఎన్నికల నిబంధనల విషయంలోనూ అదే జరుగుతుందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.