కరోనా కష్టాలకు పుల్ స్టాప్ పడి, త్వరలోనే థియేటర్లు తెరచుకోబోతున్నాయి. అక్టోబరు 15న కొత్త సినిమాని.. థియేటర్లలో చూడొచ్చు. ఏపీ ప్రభుత్వం థియేటర్ల తీతకు అనుమతి ఇచ్చింది. కొత్త సినిమాలు కూడా విడుదలకు రెడీ అంటున్నాయి. అయితే… థియేటర్ల నిర్వహణ అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే అన్ లాక్ నిబంధనలు థియేటర్ యాజమాన్యాన్ని భయపెడుతున్నాయి. నిర్మాతలు సినిమాని విడుదల చేసో, పంపిణీదారులకు అమ్ముకునో చేతులు దులుపుకోవొచ్చు. ఆ తరవాత కష్టమంతా థియేటర్ యజమానులదే.
50 శాతం సిట్టింగ్ ఒక్కటే సమస్య కాదు. థియేటర్ శుభ్రత, శానిటైజేషన్ ఇవన్నీ తప్పసరి. దాంతో పాటు..మరి కొన్ని క్లిష్టమైన నిబంధనలున్నాయి. టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్మాలి. బీ,సీ కేంద్రాలలో ఇప్పటికీ టికెట్లని కౌంటర్లో అమ్ముతున్నారు. ఆయా థియేటర్లు ఇప్పుడు ఆన్ లైన్ లోకి అర్జెంటుగా దిగిపోవాలి. ప్రేక్షకులందరి ఫోన్ నెంబర్లు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. కౌంటర్లో టికెట్ అమ్మితే.. ఇది సాధ్యం కాదు. కాబట్టి తప్పని సరిగా.. ఆన్ లైన్లోనే టికెట్టు అమ్మాలి. ఒకవేళ టికెట్లని ఆన్ లైన్లో అమ్మితే – వీలైనన్ని కౌంటర్లు ఎక్కువ ఉండాలన్నది తాజా నిబంధన. ఇంట్రవెల్ సమయంలోనూ, షో అయిపోయాక.. ప్రేక్షకులంతా ఒకేసారి బయటకు రావడానికి వీల్లేదు. దాంతో పాటు.. టికెట్ కొన్నవాళ్లందరి ఫోన్లలోనూ ఆరోగ్య సేతు యాప్ తప్పని సరిగా ఉండాలని ప్రచారం చేయాలట. థియేటర్లో గాలి ఆడేలా చూసుకోవాలట. అంటే.. తలుపులు మూసి ఉంచడం కుదరదు. ఏసీ థియేటర్లలో, మల్టీప్లెక్సులలోనూ తలుపులు తెరవడం సాధ్యం కాదు. థియేటర్లో తినుబండారాల్ని అమ్మకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అమ్మినా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలే అందించాలి. ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఆయా థియేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తార్ట. ఇవన్నీ జరిగే పనులేనా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుని, ఇంత ఖర్చు పెట్టినా థియేటర్లకు జనం రాకపోతే..? ఈ ప్రశ్నలే ఇప్పుడు థియేటర్ నిర్వాహకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.