ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత విఘాతాన్ని కలిగిస్తున్న వ్యవహారం ఇది. తమకు ఓట్లేసిన ప్రజల తీర్పును కించపరుస్తున్నారు ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ వీరు ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారు. పార్టీ మారడం అనేది వీరి ఇష్టం. కానీ అలా మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తాము చేరిన పార్టీ తరపున సత్తా చూపాలన్న ప్రాథమిక నియమాన్ని ఎవరూ పాటించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధకాల చట్టం ఉత్తుత్తిది అయిపోయింది.
మరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నట్టుగా ఉండే ఈ ప్రక్రియలో అధికారంలో ఉన్న వారిదే ముఖ్య పాత్ర. వెనుకటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో అయినా, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్న సమయంలో జరుగుతున్న ఫిరాయింపులతోనైనా.. ప్రజాస్వామ్యానికి విఘాతమే ఏర్పడుతోంది. మరి ఇలాంటి నేపథ్యంలో.. అధికారంలో ఉన్న వారికి కొన్ని కొన్ని ఎదురుదెబ్బలు కూడా తప్పడం లేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఎదురుదెబ్బలు తింటున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు. అచ్చం అలాగే ప్రజాస్వామ్యన్ని పరిహసిస్తున్న ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం ఎంచక్కా హ్యాపీగా ఉన్నారు! కమలనాథులు మాత్రం కోర్టు చేతిలో మొట్టికాయలు తింటూ ఉన్నారు. ముందుగా ఉత్తరాఖండ్ వ్యవహారంలో.. ఆ తర్వాత అరుణాచల్ విషయంలో బీజేపీ కి ఎదురుదెబ్బలు తగిలాయి. అక్కడ బీజేపీ సహకారంతో తలెత్తిన తిరుగుబాట్ల కు ఇబ్బందులు తప్పలేదు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఫిరాయింపుదారులకు ఎదురేలేకుండా పోయింది! ఉత్తరాఖండ్, అరుణాచల్ లలో బీజేపీ చేసినదానికి, ఏపీ తెలంగాణల్లో అధికారంలో ఉన్న వారు చేస్తున్నదానికీ పెద్దగా తేడా లేదు. కానీ రెండు సార్లు ఎదురుదెబ్బలు తగిలి బీజేపీ వాళ్లు పరువు పోగొట్టుకుంటే.. కేసీఆర్ , బాబులు మాత్రం హ్యాపీగా ఉన్నారు