హైదరాబాద్: ఈ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఊహించినట్లుగానే వాగ్వాదాలు, దూషణలతో మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నందున సభా సమయాన్ని వృథా చేయొద్దని స్పీకర్ వైసీపీ సభ్యులను కోరారు. ఇటీవల చనిపోయిన మాజీ రాష్ట్రపతి కలామ్‌కు ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత రాజమండ్రి పుష్కర దుర్ఘటనకు సంతాపం ప్రకటించే సమయంలో పరస్పర దూషణల పర్వం మొదలయింది. చంద్రబాబు మాట్లాడుతూ, పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిర్వహించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, అయినా ఘోరం జరిగిపోయిందని అన్నారు. ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ, పుష్కరాలలో భక్తులు చనిపోతే చంద్రబాబు మేకప్ వేసుకుని షూటింగ్ చేశారని ఆరోపించారు. 29మంది మృతికి కారణమైన చంద్రబాబు ప్రసంగిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు, జగన్ ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలియని మూర్ఖుడు అని దుయ్యబట్టారు. మరో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ, పుష్కర ఘటనను రాజకీయం చేయటం తగదని అన్నారు. విపక్ష నేత జగన్‌లో అపరిచిత వ్యక్తి ఉంటాడని, అందుకే అలా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. పరుష పదజాలం వాడకూడదని మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ సూచించారు. ప్రతిపక్షనేత ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సబ్జెక్ట్ చర్చిస్తే అభ్యంతరం లేదని, అలాకాకుండా ఏదిబడితే అది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పార్లమెంట్లో తలుపులు వేసి టీవీలు కట్టేసి తీర్మానం చేసినపుడు ఎంపీగా ఉన్న జగన్ ఎక్కడ దాక్కున్నారని అడిగారు. మనిషిని పొడిచి, తర్వాత దండలు వేసినట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. సభలో దీనిపై గందరగోళం చెలరేగింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల సూచించారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే ఇలా ఉంటే ఇక పోను పోనూ ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది.