రెండు రోజుల కింద ఏపీ అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు నిర్వహించిన ప్రెస్మీట్ చూసిన ఎవరికైనా .. ఇతనికీ ఓ కుటుంబం లేదా..? అతనికి తల్లిదండ్రులు లేరా.. ? అతనికి ఆడపిల్లలు లేరా ? అతనికి బంధువులు లేరా ? అని అనిపించి ఉంటుంది. అతను ఇతరుల్ని అలా తిడుతున్నప్పుడు వారి ఇంట్లో వాళ్లకీ అదే అనిపించి ఉంటుంది. తమనూ ఇతరులూ అంత కంటే ఘోరంగా తిడుతూ ఉంటారు కదా … అని వారిలో ఒక ఆలోచన వచ్చి ఉంటే సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే బూతులు తిట్టడానికి నోరు ఉంటే చాలు. ఇలా తిట్టకుండా చాలా మంది తమ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి గౌరవాలు..తమకూ తమ కుటుంబాలకు అక్కర్లేదని.. బజారున పెట్టాలనుకున్న వాళ్లు రెచ్చిపోతూంటారు. ఆ కోవలోకే కొంత మంది వైసీపీ నేతలు వస్తారు.
ప్రజాస్వామ్యంలలో బూతుల్ని మెచ్చి పదవులిచ్చే సంప్రదాయం అతి పెద్ద మానసిక రోగం !
కొంత మంది నేతలే ఇలా ఎందుకు రెచ్చిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కుటుంబాలను రోడ్డున పడేసుకుని అయిన సరే పదవులు పొందాలనేది వారి తపన. వారి పార్టీలో పెద్దలకు వారికి నచ్చని వారిపై ఎంత దారుణంగా తిట్లు కురిపిస్తే.. వారి ఇళ్లపై దాడులకు వెళ్తే వారికి పదవులు ఇస్తారు. గత మూడేళ్లుగా జరుగుతోంది అదే. ఇప్పుడు త్వరలో కొంత మందిని తీసేసి మరికొంత మందికి పదవులు ఇస్తానని దానికి అర్హత ఇతరుల్ని తిట్టడమేనని ఆ నాయకుడు హింట్ ఇచ్చాడు కాబట్టి వీళ్లంతా తెరపైకి వచ్చారు. బూతులు తిట్టడం ప్రారంభించారు. వారి బూతుల్ని అధినాయకుడు మెచ్చితే పదవి రావొచ్చు.
పదవుల కోసం ఇతరుల్ని , వారి కుటుంబాల్ని బూతులు తిట్టడం మానసికరోగాల్లో క్యాన్సర్ లాంటిది !
ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అధికారంలో లేని వాళ్లను ఎన్నైనా తిట్టవచ్చు. చెల్లుతుంది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా ! తాను అనుభవిస్తున్న అధికారం పుట్టకతో వచ్చింది కాదు… కష్టపడి సంపాదించుకున్నదీ కాదు. ప్రజలు ఇచ్చింది. వారు అధికారం ఇచ్చింది బూతులు తిట్టమని కాదు. రేపు వారు ఆ అధికారాన్ని లాగేసుకోవడం ఖాయం. చరిత్రలో శాశ్వతంగా అధికారంలో ఉన్న వాళ్లెవరూ లేరు. రేపు అధికారం పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ?. ఇప్పుడు బూతులు పడిన వారు అప్పుడు కుటుంబాన్ని రోడ్డున పడేస్తే అవమానంతో బాధపడాల్సింది ఎవరు ? ఈ నాయకులే.. కానీ వీరి నాయకుడు కాదు. వీరిని పావులుగా వాడుకుని మానసిక ఆనందం పొందడానికో… మరో విధమైన తృప్తి పొందడానికో తిట్టించి ఉండవచ్చు కానీ.. రేపు ఈ పర్యవసానాలు మాత్రం అనుభవించాల్సింది ఈ నాయకుడు.. ఆయన కుటుంబమే. భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించకుండా చెలరేగిపోతే.. భవిష్యత్లో కనీసం సానుభూతి చూపేవారు కూడా ఉండరు. చరిత్ర చెబుతోంది అదే.
బూతులు తిట్టే వారు.. తిట్టించే వారు … తమ రోగాన్ని మాన్పించుకోకపోతే మొదటికే మోసం !
నిజానికి వారి నాయకుడి లక్ష్యం ఒకటే. ఏ సామాజిక వర్గ నాయకుడ్ని ఆ సామాజికవర్గంతో తిట్టిస్తారు. రేపు బ లైపోతే .. తనకు ఇష్టం లేని ఆ సామాజికవర్గం నేతలే. వీళ్లు తమ పార్టీ నాయకులని ఆయన ఎప్పుడూ అనుకోరు. అందుకే ఆయన సామాజికవర్గం వాళ్లు ఎప్పుడూ బూతులు అందుకోరు. రేపు అధికారం మారితే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. కానీ వీళ్లకు పదవులు ఆశ చూపి బూతులు తిట్టమని ప్రోత్సహించేస్తున్నారు. వారు తిడుతున్నారు. అదే సామాజికవర్గాల్లో వ్యతిరేకత నింపుతున్నారు. రేపు వారి సామాజికవర్గంలోనూ వారిపై సానుభూతి రాకుండా చేస్తున్నారు. ఇది రాజకీయాల్లో ఉన్న వారికి తెలియనిదేం కాదు.
రోగం ముదిరి.. కుళ్లిపోయాక … దీనవాస్థలో ఎవరూ సానుభూతి కూడా చూపరు..!
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రేపు ఆ పార్టీ అధినేతనైనా వదులుతారని గ్యారంటీ లేదు. ఇలా తిట్టిస్తున్న వారు.. తిడుతున్న వారి కుటుంబాల్లో ఉన్న వారంతా ఎక్కువగా ఆడవాళ్లే. అనవసరంగా ఇవాళ తాము చేస్తున్న తప్పులకు రేపు వాళ్లు.. వాళ్ల కుటుంబాల పరువు రోడ్డున పడుతుంది. అప్పుడు అధికారం ఉండదు కాబట్టి గగ్గోలు పెట్టినా ప్రయోజనం ఉండదు. పైగా సానుభూతి కూడా రాదు. ఇవాళ తిట్టించుకున్న వాళ్లు రేపు తిట్టకపోతే తాము చేతకాని వాళ్లం అనే ముద్ర పడుతుందని అంతకు రెట్టింపు ఇస్తారు. దాని వల్ల ఏం జరుగుతుంది…? ఈ బూతుల ప్రవాహం కంటిన్యూఅవుతుంది. తమ రాజకీయాలకు తమ ఇంట్లో వాళ్లను కూడా బలి చేయడం అంటే ఇదే.
గెట్ వెల్ సూన్ లీడర్స్ !
చివరికి తెలుసుకోవాల్సిందేమిటంటే.. తిట్టడం వల్ల ఎదుటి వారికి ఎలాంటి నష్టం జరగదు. తిట్టే వాళ్లకే నష్టం జరుగుతుంది. అందుకే.. గెట్ వెల్ సూన్ లీడర్స్ !