బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు కుటుంబ వేడుకలో వైసీపీ ఎంఎల్ఎతో కలసి వున్న ఫోటో కారణంగానే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ మారతారన్న కథనాలు మొదలైనాయని దగ్గుబాటి వర్గీయులు చెబుతున్నారు. రోజాతో కలివిడిగా వుండటాన్ని బట్టి కథలు ప్రచారంలోకి వచ్చాయని ఆమెకు ఆ ఆలోచనే లేదని కొట్టిపారేస్తున్నారు. బిజెపిలో పురంధేశ్వరికి తగు న్యాయం జరగలేదని వారిలో బాధ వుంది. విశాఖపట్టణంలో పోటీ చేయనీయకుండా అడ్డుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట సూచిస్తే పోటీ చేశారే తప్ప అక్కడ ఫలితం ముందే తెలుసని వారు చెబుతున్నారు. ఇప్పుడు కూడా బిజెపి ముఖ్యులను ఆయన ప్రభావితం చేస్తున్నారని వారి సందేహం. ఏమైనప్పటికీ ఈ దశలో వైసీపీలో చేరాలనే ఆలోచనే చేయడం లేదనీ భవిష్యత్తులోనూ జరగదని చెబుతున్నారు. అయితే ఈ కథనాలను హడావుడిగా ఖండించడంపైనా వారికి ఆసక్తి లేదు. ఏమంటే ఇవి ఎంతోకొంత మేరకు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడొచ్చని అనుకుంటున్నారు. ఆ మేరకు చంద్రబాబుపైన టిడిపిపైన కొంత ఒత్తిడి తప్పదని బిజెపి నాయకులు కూడా స్పందించాల్సి వస్తుందని భావిస్తున్నారు. బిజెపిలో స్వభావసిద్ధంగానే ఇలాటి పరిస్థితి వస్తుంటుందని అయితే తప్పక అన్నీ సర్దుకుంటాయని ఆరెస్సెస్ అగ్రనేత ఒకరు భరోసా ఇచ్చారట. పైగా పార్లమెంటు ఎన్నికలు చాలా దూరం వున్నాయి. ఈ సమయంలో ఏ విధమైన తొందరపాటు అవసరం లేదన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది.