రాష్ట్ర విభజన, జగన్ సొంత అనే రెండు ఘటనలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం లిఖించాయి. ఆ పార్టీ 2019కి కాదు కాదు కదా.. 2039కి అయినా కోలుకుంటుందనే గ్యారంటీ… ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా లేదు. అలా అని వదిలేయలేరు కాబట్టి.. జన్మకో శివరాత్రి అన్నట్లుగా రాహుల్ గాంధీ ఓ పది నిమిషాలు సమీక్షలు జరిపి… కేరళ నేత ఊమెన్ చాందీకి బధ్యతలిచ్చి చేతులు దులుపుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినా..కాంగ్రెస్కు వచ్చింది వంద కంటే..కొంచెం ఎక్కువ ఓట్లు మాత్రమే. అదీ ఆ పార్టీ పరిస్థితి.
ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది కాబట్టి… రఘువీరారెడ్డి ఇంకా కాంగ్రెస్లో ఉన్నారని లేకపోతే.. ఎప్పుడో తన దారి తాను చూసుకునేవారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. రఘువీరా కాకుండా.. కాంగ్రెస్లో మిగిలిన నేతలు చాలా కొద్ది మంది. అదీ కూడా ప్రజాబలం ఉన్నవారు ఇద్దరు ముగ్గురే. వారిలో ఒకరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారునిగా రాజకీయ ఆరంగేట్రం చేసి… తన వర్గాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై అమితమైన అభిమానంతో ఉండే కోట్ల ఫ్యామిలీ.. ఇంత కాలం… వేరే పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరగలేదు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో…కోట్ల ఫ్యామిలీ వస్తే.. తమ పార్టీకి చాలా మంచిదని.. అటు టీడీపీ.. ఇటు వైసీపీ కూడా భావిస్తున్నాయి. అందుకే రెండు పార్టీలూ.. తమ శక్తిమేర.. తమ పార్టీలో చేరబోతున్నారని గతంలో ప్రచారం చేశాయి.
కానీ కోట్ల మాత్రం.. ఇద్దరికీ సమదూరం పాటిస్తున్నారు. రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి మద్దతు ప్రకటించారు. తన వర్గంతో ఓట్లు వేయించారు. అయినా అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన… శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. అప్పుడు వైసీపీకి మద్దచ్చిన చొరవతో ఆ పార్టీ నేతలు… కోట్ల తమ పార్టీలో చేరుతారని ప్రకటనలు చేశారు. కానీ కోట్ల మాత్రం ఖండించారు. జగన్ పాదయాత్ర సమయంలో… వైసీపీలో చేరతారనుకున్నారు కానీ.. ఆయన చాన్సే లేదని చెప్పేయడంతో.. జగన్ కోట్ల స్వగ్రామం లద్దగిరి మీదుగా వెళ్లకుండా… రూటు కూడా మార్చుకున్నారని ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు ఇటీవలి కాలంలో… మళ్లీ ఎన్నికల వేడి పెరిగుతోంది. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే.. కోట్ల ఫ్యామిలీకి అయినా గడ్డు పరిస్థితి ఖాయం. అందుకే..ఇప్పుడు తన కోసం కాకపోయినా…తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం అయినా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం ఇతర ఆలోచనలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఊమెన్ చాందీకి ఏపీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత కొన్ని సమావేశాలు నిర్వహించారు. వాటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కూడా సమాచారం పంపారు. కానీ ఆయన వెళ్లలేదు. పార్టీ హైకమాండ్ నుంచి కాల్స్ వచ్చినా స్పందించడం లేదట. దాంతో కోట్ల రాజకీయ పయనంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈ సారి ఏదో ఒకటి నిర్ణం తీసుకోవచ్చని కర్నూలు నుంచి జోరుగానే ప్రచారం జరుగుతోంది.