ఓ సినిమా మొదలైందంటే, అందులోని కాంబినేషన్లపై రకరకాల ఊహాగానాలు రావడం సహజం. వాళ్లు టీమ్ లోకి వచ్చారు, వీళ్లు బయటకు వెళ్లిపయారంటూ కథలు, కథనాలు వండేస్తుంటారు. అయితే ఈమధ్య టీమ్ లోకి వచ్చేవాళ్ల కంటే వెళ్లిపోతున్నవాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. కెమెరామెన్లు, సంగీత దర్శకులు లాస్ట్ మినిట్‌లో జంప్ అవుతున్నారు. తాజాగా.. ‘సైరా’ నుంచి ఏఆర్ రెహమాన్ బయటకు వెళ్లిపోయాడన్న ఓ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. కమ్యునికేషన్ గ్యాప్స్ వల్ల.. రెహమాన్‌కీ, సురేందర్ రెడ్డికీ పొసగలేదని, అందుకే ‘ఈ సినిమా నేను చేయలేను’ అంటూ రెహమాన్ వాకౌట్ చేశాడని చెప్పుకొంటున్నారు. అయితే అలాంటివేం జరగలేదట. ఈ సినిమా కోసం రెహమాన్ భేష్షుగ్గా తన పని తాను చేసుకొంటూ వెళ్లిపోతున్నాడని సమాచారం. ఇప్పటికే ‘సైరా’ ట్యూన్లు సిద్ధం చేసే పనిలో ఉన్నాడట రెహమాన్. సురేందర్ రెడ్డి కూడా రెహమాన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతం.. అంటున్నాడు. రెహమాన్ వాకౌట్ చేశాడనడం కేవలం రూమరే అని, ఈ సినిమాకి సంగీత దర్శకుడు రెహమానే అని గట్టిగా చెబుతోంది. రెహమాన్ ట్యూన్స్ లో పస తగ్గిందన్నది వాస్తవం. ఇది వరకటిలా ఆయన పాటలు హల్ చల్ చేయడం లేదు. కానీ చారిత్రక నేపథ్యం ఉన్న కథలకు సంగీతం అందించడంలో ఇప్పటికీ రెహమానే దేశంలో కెల్లా నెం.1 సంగీత దర్శకుడు. ముఖ్యంగా ఆర్.ఆర్ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాల్ని సృష్టించిన రెహమాన్‌ని అంత తేలిగ్గా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. సో.. రెహమాన్‌పై పుట్టింది కేవలం రూమరే.. రెహమాన్ సైరా టీమ్‌లోనే ఉన్నాడు.. ఉంటాడు కూడా.