గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. ఈ మధ్య కాలంలో.. రోజువారీగా.. పార్టీ మార్పు ఊహాగానాలొస్తున్నాయి. బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆయనకు బంధువు కావడంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం.. కొద్ది రోజులుగా ఉద్ధృతంగా సాగుతోంది. ఇటీవల కిషన్ రెడ్డి.. విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు.. ఆయనను కలిసినట్లుగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమం కోసం… తనను ఆహ్వానిస్తే వెళ్లానని.. అక్కడ.. ఆయన కలిశాడు తప్ప రాజకీయం లేదని.. తేల్చేశారు. బీజేపీలోకి పోనే పోనని స్పష్టం చేశారు. అది అలా ఉండగానే… మళ్లీ కొత్తగా.. మరో ప్రచారం ప్రారంభమయ్యే సచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి ఆయన ఖాతాలో వైసీపీ పడే అవకాశం ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ అసెంబ్లీలో కలిశారు. ఏం మాట్లాడారో కానీ బయటకు మాత్రం… గన్నవరం నియోజకవర్గ సమస్యలపై కలిసినట్లు.., ఆయన అనుచరులు చెబుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కుడికాలువ ఉంది. ఆ నియోజకవర్గం మీదుగా.. పట్టిసీమ నుంచి ఎత్తిపోసే నీళ్లు.. ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంటాయి. అలా కాలువ నీళ్లను… వాడుకునేందుకు.. ఆయన కాలువపై సొంత ఖర్చుతో మోటార్లను ఏర్పాటు చేశారు. వాటికి కరెంట్ ను వాడుకున్నారు. అప్పట్లో టీడీపీ సర్కార్ కాబట్టి.. ఎవరూ అడగలేదు. ఇప్పుడు సర్కార్ మారింది. కరెంట్ ను అప్పుడు వాడుకున్నట్లే వాడుకుంటే.. అధికారులు మోటార్లను తీసుకెళ్లిపోతారు. అందుకే.. నేరుగా సీఎంను కలిసి.. ఆ మోటార్లకు.. కరెంటివ్వాలని కోరారు. నిజానికి ఇదే అంశంపై.. ఆయన రెండు రోజుల కిందట… ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు. వంశీ విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారంటున్నారు.
అధికారికంగా .. నిజంగా జరిగింది ఇదే అయినా… వల్లభనేని వంశీపై మాత్రం ప్రచారం ప్రారంభం కావడం ఖాయం అవుతుంది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డితో గతంలో ఆయన.. గట్టిగా ఆలింగనం చేసుకున్న సందర్భం.. అందరి మదిలోనూ ఉంది. అప్పట్లో ఆయన …తన మిత్రుడు కొడాలి నానితో కలిసి.. వైసీపీలోకి పోతారని అనుకున్నారు. కానీ వెళ్లలేదు. ఈ ప్రచారాలు ఉద్ధృతంగా సాగుతూనే ఉంటాయి.. జరుగుతూనే ఉంటాయని తెలిసినా.. వంశీ మాత్రం.. తన పని తాను చేసుకుంటున్నారు.