మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎవరికీ రాని కష్టం వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ఆయనను కొట్టారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన సమావేశానికి వెళ్లారని బయటకు వచ్చేటప్పుడు కళ్ల జోడు విరిగిపోయిందని చెప్పుకున్నారు. అది ఆ నోటా.. ఈ నోటా పడి చివరికి ఎమ్మెల్యే వద్దకే చేరింది. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఖండించకపోతే పరువు పోతుందని అనుకున్నారు. కానీ ప్రెస్‌మీట్ పెట్టి ఖండిస్తే రాజకీయం అయిపోతుంది.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకుడి ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఎందుకు చేయి చేసుకుంటారని ప్రశ్నించారు.
కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కానీ ఖమ్మం జిల్లా పొరుగు రాష్ట్రం కావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆయన తెలుగు యువత నేత దొరకడం లేదు. ఎలాగోలా పట్టుకోవడానికి సీరియస్‌గా ట్రై చేస్తున్నారు. అయితే ఈ లోపు వసంత కృష్ణప్రసాద్‌కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది.