రజనీకాంత్ ఆరోగ్యంపై ఇది వరకెప్పుడూ లేనన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. రజనీకాంత్ ఇటీవలే అమెరికా వెళ్లారు. విహారయాత్రకు అని కుటుంబ సభ్యులు చెబుతన్నా.. రజనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కిడ్నీలు పాడయ్యాయని, కిడ్నీల మార్పుకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందన్న గుసగుసలు వినిపించాయి. దీనిపై రజనీగానీ, ఆయనకుటుంబ సభ్యులు గానీ ఇంత వరకూ స్పందించలేదు. ఇప్పుడు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ తొలిసారి రజనీ ఆరోగ్యంపై స్పందించాడు. రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో కొన్ని వైద్య పరీక్షలు చేయించుకొంటున్నారని, త్వరలోనే చెన్నై తిరిగొస్తారని, కబాలి ప్రమోషన్లలోనూ పాల్గొంటారని క్లారిటీ ఇచ్చారు.
వైద్య పరీక్షలు అనగానే… ఫ్యాన్స్ లో మళ్లీ అలజడి రేగింది. అయితే రజనీ కచ్చితంగా అనారోగ్యం పాలై ఉంటారని రజనీ ఫ్యాన్స్ బెంగ పెట్టుకొంటున్నారు. రజనీ కబాలి ప్రమోషన్లకు రావడం కష్టమే అన్నది లేటెస్ట్ టాక్. రోబో 2 షూటింగ్కీ సుదీర్ఘమైన విరామం ప్రకటించారని రజనీ మళ్లీ ఎప్పుడు సెట్లోకి వస్తారో తెలీదని కూడా చెబుతున్నారు. ఇన్ని గాసిప్పులు వినిపించినా రజనీ మాత్రం బయటకు రావడం లేదు. కనీసం బాగానే ఉన్నానంటూ ఒక్క వీడియో మెసేజ్ కూడా పంపండం లేదు. రజనీ ప్రస్తుత ఆరోగ్యపరిస్థితి గురించి చెప్పడానికి ఎవ్వరూ అందుబాటులో లేరు. దాంతో ఫ్యాన్స్ మరింత భయపడుతున్నారు. రజనీ ఎప్పుడొస్తాడో… అప్పుడే ఈ భయాలన్నీ తొలగిపోతాయి.