దసరా కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నాని – శ్రీకాంత్ ఓదెల కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఎంచుకొన్నట్టు వార్తలొస్తున్నాయి. చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా, జాన్వీ ఎంట్రీ దాదాపుగా ఖాయమే. జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో తాను నటించిన సినిమా ఏదీ ఇప్పటి వరకూ రాలేదు. కానీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు తన సొంతం అవుతున్నాయి. ప్రస్తుతం ‘దేవర’లో నటిస్తోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమాలోనూ తనే కథానాయిక. ‘పుష్ష 2’లో ఐటెమ్ పాట కోసం జాన్వీ పేరు పరిశీలిస్తున్నారు.
కాకపోతే.. నాని పక్కన జాన్వీ ఏమిటన్నది నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్న. ‘అన్నా.. నీకు జాన్వీ సెట్ కాదు..’ అంటూ కొంతమంది నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా నానికి సలహాలు ఇస్తున్నారు. జాన్వీ అక్కలా ఉంటుందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ‘దసరాలో కీర్తి సురేష్ తో నీ జోడీ బాగుంది కదా, తననే తీసుకోండి’ అంటూ ఈ టాపిక్‌లోకి కీర్తిని కూడా తీసుకొస్తున్నారు. నాని కథల ఎంపిక ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, ఆ కథలో తనకు జోడీగా హీరోయిన్లనీ అంతే పర్ఫెక్ట్గా ఎంచుకొంటాడు. ‘హాయ్ నాన్న’లో మృణాల్ విషయంలో తప్పు చేశాడన్నది నాని అభిమానుల వాదన. ఆ సినిమాలో మృణాల్ తో నాని కెమిస్ట్రీ మిస్ మ్యాచ్ అయ్యిందని, నాని పక్కన మృణాల్ వయసు ముదిరిన పిల్లలా కనిపించిందన్న కామెంట్లు వినిపించాయి. జాన్వీ విషయంలోనూ అదే జరుగుతుందన్నది అభిమానుల బెంగ. మరి ఈ విషయంలో నాని ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో చూడాలి.