‘పుష్ష 2’ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఇది చాలా మామూలు వార్తే! కానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ‘పుష్ష 2’ షూటింగ్ కు బ్రేక్ ఎందు వల్ల వచ్చిందో, దాని వెనుక ఏం జరుగుతోందో ఒకొక్కరూ ఒక్కో స్టోరీ అల్లేస్తున్నారు.
ఆగస్టు 15న ‘పుష్ష 2’ రావాల్సివుంది. కానీ వాయిదా పడింది. దానికి కారణాలు అనేకం. ఇప్పుడు డిసెంబరుకు వాయిదా పడింది. దాంతో… సుకుమార్ పై టెన్షన్ తగ్గింది. డిసెంబరు వరకూ టైమ్ ఉంది కదా, అని ఆయన తాయితీగా సినిమాని చెక్కడం ప్రారంభించాడు. మధ్యలో కావల్సినన్ని బ్రేకులు వచ్చి పడుతున్నాయి. ఒకొక్కసారి ఒకొక్క కారణం. ఓసారి ఫహద్ ఫాజల్ డేట్లు లేవు. మరోసారి ఓ నటుడికి స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఇంకోసారి వర్షం. ఇంకోసారి సుకుమార్‌కి ఒంట్లో బాగోలేదు. ఇలా.. రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో బన్నీలో అసహనం పెరిగిందని, తాను కూడా చెప్పాపెట్టకుండా షూటింగ్‌కి డుమ్మా కొట్టాడని, అంతేకాదు, గెడ్డం కూడా ట్రిమ్ చేసేసుకొని, చిత్రబృందానికి గట్టి షాక్ ఇచ్చాడని వార్తలొచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా సుకుమార్ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిపోయాడు. దాంతో ‘పుష్ష’ విషయంలో ఏం జరుగుతోందా? అనే ఆసక్తి, అనుమానం అందరిలోనూ మొదలైపోయింది.
సుకుమార్ శైలి తెలిసిందే. ఆయన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. సినిమాకి మూడేళ్లు టైమ్ ఇచ్చినా, ఇంకో నెల రోజులు ఉంటే బాగుణ్ణు అనుకొనేరకం. ‘పుష్ష 1’ విషయంలో అదే జరిగింది. చివరి నిమిషం వరకూ ఆయన ఎడిటింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉన్నాడు. దాంతో ప్రమోషన్లకూ ఆయన దొరకలేదు. కానీ అవుట్ పుట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘పుష్ష’ లాంటి హిట్ వచ్చాక నిర్మాతలకైనా, హీరోకైనా దర్శకుడ్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం తప్ప మరో మార్గం లేదు. ‘పుష్ష 2’పై పెరిగిన అంచనాల నేపథ్యంలో సుకుమార్ మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. అందుకు కావల్సినదానికంటే ఎక్కువ సమయం తీసుకొంటున్నాడు. అది బన్నీకి నచ్చడం లేదు. ఒకే గెటప్పులో, ఒకే క్యారెక్టర్ మూడ్ లో ఏళ్లకు ఏళ్లు ఉండాలంటే ఎవరికైనా కష్టమే. పైగా చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. తన కోసం చాలా కథలు ఎదురు చూస్తున్నాయి. అందుకే బన్నీ స్పీడు పెంచమంటున్నాడు. అలాగైతే తన వల్ల కాదంటున్నాడు సుక్కు. అందుకే ఈ గ్యాప్. కాకపోతే ఒకరిపై ఒకరికి కోపం, అసహనం వచ్చినంత స్థాయిలో అయితే వీరిద్దరి గ్యాప్ లేదు. ఎందుకంటే బన్నీ కెరీర్లో సుకుమార్.. సుకుమార్ కెరీర్లో బన్నీకి ఉన్న స్థానం అది. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న సంకేతం మాత్రం తమని అభిమానించే వర్గానికైనా చేరవేయాల్సిన బాధ్యత వీరిద్దరికీ ఉంది. అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.
అమెరికా వెళ్లిన సుకుమార్ ఈరోజే ఇండియా తిరిగొచ్చాడు. వచ్చే వారంలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అది కాస్త మొదలైపోతే – ఈ రూమర్స్ కు చెక్ పడినట్టే.