తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, దీంతో తెరాసలో వారసత్వ చర్చ జరుగుతున్నట్టు కొన్ని కథనాలు వినిపించాయి. మరీ ముఖ్యంగా మంత్రి హరీష్ రావు ప్రాధాన్యతపై చాలా ఊహాగానాలే వచ్చాయి. అయితే, మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో.. పార్టీ మారే ఆలోచనలో హరీష్ రావు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశం హరీష్ రావు దృష్టికి రావడంతో ఆయన ఫైర్ అయ్యారు. అలాంటి కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. అంతేకాదు, ఈ తప్పుడు ప్రకటనలపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చామని మంత్రి హరీష్ చెప్పారు. ఇప్పటికే తాను ఈ విషయం వందసార్లు చెప్పాననీ, మళ్లీ చెప్తున్నాననీ.. తన పుట్టుక తెరాసలోనే తన చావు కూడా తెరాసలోనే అన్నారు. కలలో కూడా పార్టీ మార్పుకు సంబంధించిన ఊహ ఎవ్వరికీ రావడానికి ఆస్కారం లేదన్నారు. తాము ఉద్యమాలూ త్యాగాల నేపథ్యం నుంచి పార్టీలోకి వచ్చినవారమన్నారు. కేసీఆర్ పిలుపునిస్తే తృణప్రాయంగా పదవుల్ని వదులుకున్న చరిత్ర తమదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి, ఓసారి మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. తనకు త్యాగాలు మాత్రమే తెలుసుననీ, ద్రోహాలు తెలీవన్నారు. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే విరమించుకోవాలన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో కూడా ఇలాంటి కథనాలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పదవికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోని నేపథ్యంలో ఆయన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కొన్ని కథనాలు వెబ్ మీడియాలో కూడా అక్కడక్కడా కనిపించాయి. అంతేకాదు.. కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న మూడో ఫ్రెంట్ కు ఆయన పెద్దన్నగా వ్యవహరిస్తారని కూడా కొంతమంది రాసేశారు. అయితే, ఇవి కూడా అవాస్తవాలే అని కొన్ని మీడియా సంస్థలు ఢిల్లీ వర్గాలను కనుక్కుని నిర్ధారించాయి. కేవలం సంచలనం కోసమే ఇలాంటి సందర్భంలో కొన్ని కథనాలు పుట్టుకొస్తాయి. మరి, ఏం ఆశించి ఇలాంటి కథనాలను ప్రచారంలోకి తెస్తారో తెలీదు..!