అనుష్క… ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన కథానాయిక. అగ్ర హీరోలతో జోడీ కట్టి టాప్ హీరోయిన్ అనిపించుకొంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది. బాహుబలి లాంటి సినిమా అనుష్క ఖాతాలో వుంది. అయితే బాహుబలి తరవాత ఆ సినిమాలో నటించనవాళ్ల కెరియర్ గ్రాఫులు మారిపోయాయి.. ఒక్క అనుష్కది తప్ప. బాహుబలి విజయం తరవాత ఆ స్థాయిలో స్వీటీ సినిమాలు చేయలేకపోతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తరవాత స్వీటీ కనిపించలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటీలో నటించింది. ఇది కాకుండా ఓ మలయాళ సినిమా చేతిలో ఉంది.
అనుష్క ప్రస్తుతం ఏడు సినిమాలు చేస్తోందని, అవన్నీ గప్ చుప్‌గా షూటింగ్ జరుపుకొంటున్నాయని, ఈ లెక్కన స్వీటీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసినట్టే అని ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. నిజంగానే.. ఇది నిజమనుకొని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అనుష్క ఒక్కసారిగా ఇన్ని సినిమాలు ఎలా పట్టింది? అంటూ ఊహాగానాల్లో తేలిపోతున్నారు.
నిజానికి అనుష్క ఈమధ్య కొత్త సినిమాలేం ఒప్పుకోలేదట. ఘాటీ తరవాత తెలుగులో ఒక్క సినిమా కూడా సంతకం చేయలేదని, అసలు షూటింగులకు వచ్చే మూడ్, కొత్త కథలు వినే ఓపిక అనుష్కలో లేవని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అనుష్కకు కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. ఆమె ఈమధ్య మరీ బొద్దుగా తయారైపోయింది. ఇది వరకటి ఫిట్ నెస్ అనుష్కలో లేదన్నది నూటికి నూరుపాళ్లూ నిజం. ఒప్పుకొన్న సినిమాలే చాలా కష్టపడి పూర్తి చేసింది. అలాంటప్పుడు కొత్త కథలు ఎలా ఒప్పుకొంటుంది? బరువు తగ్గాలని అనుష్క చేసిన కొన్ని ప్రయత్నాలు బెడసి కొట్టేశాయి. దాంతో ఆమె మీడియా ముందుకు కూడా రాలేకపోతోంది. అనుష్కని ఓ సినిమా ఫంక్షన్లో చూసి ఎంతో కాలమైంది. ఓ సినిమా ఒప్పుకొంటే, ఆ సినిమా ప్రచారంలో తప్పకుండా కనిపించాలి. అందుకే.. ఈ ఇబ్బందులు తట్టుకోలేక అనుష్క సినిమాలు తగ్గించేసింది. అలాంటప్పుడు ఒకేసారి ఏడు సినిమాలు ఎలా ఒప్పుకొంటుంది? ఈ చిన్న లాజిక్ ని అంతా ఎలా మిస్ అయిపోయారో?