రెండు మూడేళ్లుగా నలుగుతున్న గాసిప్ ప్రభాస్ – అనుష్కల పెళ్లి. ఇప్పుడు మళ్లీ కొత్త దినుసులు పేర్చి, కొత్తగా తాళింపు పెట్టి.. వదిలారు. డిసెంబరులో నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని, వీరిద్దరి ప్రేమ ఇక అధికారికమే అని ఉమైర్ సంధు అనే ఓ సినీ విశ్లేషకులు ట్విట్టర్లో పోస్టింగ్ చేయడంతో… మళ్లీ ఈ వ్యవహారం గుప్పుమంది. ఈసారి… ప్రభాస్ అభిమానులు సైతం ఇది నిజమేగామోసు అనేసుకొన్నారు. మిర్చి సమయం నుంచీ వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, బాహుబలితో అది మరింత బలపడిందన్నది వార్తల సారాంశం. అయితే… ప్రభాస్ పీఆర్వోలు, సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని గట్టిగానే ఖండిస్తున్నారు. అసలు ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దని, ఉమైర్ సంధు పేరుతో ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ కూడా నకిలీదే నని గట్టిగానే చెబుతున్నారు. అటు ప్రభాస్, ఇటు అనుష్కల నుంచి ఏ విషయం స్పష్టంగా బయటకు రానప్పుడు, ఇద్దరిలో ఒక్కరు కూడా నోరు విడచి బయటకు చెప్పనప్పుడు వాళ్ల పెళ్లంటూ ఫేక్ న్యూస్లు ప్రమోట్ చేయడం జర్నలిజం అనిపించుకోదని – ప్రభాస్సన్నిహితులు కొందరు వాపోతున్నారు. ప్రభాస్, అనుష్క.. ఇద్దరికీ పెళ్లీడు వచ్చేసి, దాటేసే పనిలో ఉంది. ప్రభాస్ ఇంట్లో సంబంధాలు చూశారు కూడా. వాటిపై ప్రభాస్ ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. 2018లో ప్రభాస్ పెళ్లి చేయడం ఖాయమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈలోగా ఇలాంటి పుకార్లు నమ్మొద్దన్నది వాళ్ల మాట. ఇకనైనా వీటికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.