రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారంటే… ఎవరికి వారు మంటలేసి చలి కాచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎందుకు వస్తాయో.. ఎలా వస్తాయో తెలియదు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అనాలోచితంగా రాసేస్తూంటారు. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య భేటీలో తెలంగాణ డిమాండ్ చేస్తూందంటూ కొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు.
నిజానికి ఒక్క రోజు ముందే పది అంశాలను ఎజెండాగా ప్రకటించారు. అధికారిక ప్రకటనలో కేవలం విభజన చట్టంలో ఉండి… పరిష్కారం కాని సమస్యల గురించి మాత్రమే చర్చిస్తామని ఉంది. నిజానికి అసలు సమావేశం కూడా అందుకే. మరే అంశం చర్చించినా అది అధికారికం కాదు. కానీ ఏపీలో తీరాన్ని అడుగుతున్నారని.. పోర్టులు అడుగుతున్నారని తిరుమల టెంపుల్లో వాటా అడుగుతున్నారని ఇలా రాసుకొచ్చేశారు. వాటిని చూపించి … పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయి.
అసలు ఈ వార్తను ఎవరు ప్లాంట్ చేశారో స్పష్టత లేదు. కానీ తెలంగాణ ఆస్తులు ఇచ్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఇది గట్టికౌంటర్ గానే ఉంది. రేవంత్ ఆషామాషీ కాదని చాలా అడుగుతారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పైడిమాండ్లు బీఆర్ఎస్ కూడా ఎప్పుడూ అడగకపోవడంతో … వారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏపీలో వైసీపీకి ఎలా స్పందించాలో తెలియడంలేదు.
అసలు ఏడు మండలాల ఇష్యూనే విభజన చట్టంలో లేదని .. అందుకే ఎజెండాలో పెట్టలేదని తెలుస్తోంది. మరో వైపు అవేమీ వద్దు ఐదు గ్రామాలు చాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. మధ్యలో ఈ విపరీత డిమాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం ఎవరికీ అర్థం కవడం లేదు.