ఒక వార్తని ట్విస్ట్ చేసి రాయడానికి కూడా కామన్ సెన్స్ కావాలి. ఎదో సంచలనం సృష్టించేయాలనే యావలో సొంతం పైత్యం జోడిస్తే అసలు అజ్ఞానం బయటపడుతుంది. ఇప్పుడు ‘పుష్ప 2 ఆర్ఆర్’ అనేది హాట్ టాపిక్. ఈ సినిమా ఆర్ఆర్ కోసం డైరెక్టర్ సుకుమార్, తమన్, అజినీస్ ని ప్రాజెక్ట్ లోకి తెచ్చారనే కబురు వైరస్ లా పాకింది. ఈ వార్తపై నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇందులో వాస్తవం వుంది. తగిన సమయం లేకపోవడంతో సినిమాలో కొంత పార్ట్ ని తమన్, అజినీస్ ఇచ్చే ఏర్పాటు చేశారట సుకుమార్.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కి గాసిప్పు రాయుళ్ళు తమకు తోచిన మసాలా కోటింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో దేవిశ్రీని తక్కువ చేస్తూ కథనాలు వండుతున్నారు. దేవిశ్రీ ఇచ్చే బిజీఎం సుకుమార్ కి నచ్చలేదని, దేవి సౌండింగ్ పై నమ్మకం కుదరడం లేదని, అటు బన్నీకి కూడా దేవి ఇచ్చే అవుట్ పుట్ పై అసంతృప్తిగా వున్నారని, అందుకే దేవిశ్రీని తప్పించేశారని.. ఇలా పసలేని రాతలు రాస్తున్నారు.
దేవిశ్రీపై సుకుమార్ నమ్మకం కోల్పోయారనే కోణంలో రాస్తున్న రాతలు నిజంగా అజ్ఞానమే. పుష్పకి ఒక కల్ట్ ఫాలోయింగ్ తీసుకురావడంలో దేవిశ్రీ మ్యూజిక్ ప్రధాన భూమిక పోషించింది. పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇక బిజీఎం విషయానికి వస్తే.. దేవిశ్రీ వర్క్ మెస్మరైజింగ్.
పుష్ప క్యారెక్టర్, స్టొరీ ఎసెన్స్ ని పట్టుకొని సౌండ్ క్రియేట్ చేశారు. ఎలివేషన్స్ తో పాటు అందులోని ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యేలా ట్రాక్స్ చేశారు. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి పుష్ప వరల్డ్ తో ట్రావెల్ అవుతున్నారు. పుష్ప కి దేవిశ్రీ బిగ్గెస్ట్ ఎసెట్. పైగా దేవితో సుకుమార్ కి వున్న ఈక్వేషన్ నెక్స్ట్ లెవల్. అలాంటి దేవిశ్రీపై సుకుమార్ చివరి నిమిషంలో నమ్మకం కోల్పోతారా? కానే కాదు. సమయం సరిపోకవడం వలనే ఇలా టీములుగా విడగొట్టి పని చేయిస్తున్నారు తప్పితే మరొకటి కాదు.