ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. అంతే టీవీ 9కి పార్టీ మారుతున్నారని తట్టింది. వెంటనే ప్రచారం చేసేసింది. అసలు పార్టీ మారాలంటే ఈటల ఢిల్లీ ఎందుకు వెళ్లాలన్న కనీస కామన్సెన్స్ ఉపయోగించలేదు. ఓ ఇంగ్లిష్ పత్రికలో ఈటల మళ్లీ టీఆర్ఎస్లోకి వెళ్తారని.. ఆయనకు కేసీఆర్ తిరస్కరించలేని ఆఫర్ ఇచ్చారని రాసుకొచ్చారు. దాన్ని చూసి ఈటల పార్టీ మార్పుపై ప్రచారం చేశారు. ఒక వేళ అదే నిజమైతే.. ఈటల ఢిల్లీకి ఎందుకు వెళతారు ?
అదే సమయంలో మరో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీవీ9కి ఢిల్లీలో కనిపించారు. అంతే బీజేపీలో చేరడానికే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం చేసేశారు. లాజిక్ ఏమిటంటే.. మర్రి శశిధర్ రెడ్డి వెళ్లిన విమానంలోనే డీకే అరుణ కూడా ఢిల్లీకి వెళ్లారట. ఆమె శశిధర్ రెడ్డిని తీసుకుని బీజేపీలో చేర్పించడానికి వెళ్లారని చెప్పుకొచ్చారు. శశిధర్ రెడ్డి.. తాను తన మనవడి స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చానని.. ఇదేం ప్రచారమని మండిపడ్డారు. శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారు కానీ.. ఆయన పార్టీ వీడతారని..ఆయనను బీజేపీలో చేర్చుకుంటారని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ టీవీ9 మాత్రం ఆ బాధ్యత తీసుకుంది.
అసలు పార్టీ మారాలనుకున్న నేతల ఉత్సాహం సంగతేమో కానీ..వారి గురించి ముందుగానే టీవీ9 ఆతృత పడుతోంది. రోజు రోజుకు ఇమేజ్ మసకబారిపోతున్నా.. ఆ చానల్ తీరులో మార్పు రావడం లేదు. కనీసం అలా జరిగే చాన్స్ ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా.. వార్తలేస్తూ.. ట్రోలింగ్‌కు గురవుతోంది.