వైకాపా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు, అదే విషయాన్ని పార్టీ అధనేత జగన్మోహన్ రెడ్డికి చెప్పారని కూడా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై మేకపాటి స్పందిస్తూ… ఈ కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. మీడియాలో ఒక వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తనను టార్గెట్ చేసుకుని కొన్ని ఛానెళ్లు కావాలనే పార్టీ వీడుతున్నట్టు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ నాయకత్వ పటిమను మెచ్చుకున్నారు. ప్రజల గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారనీ, ఆయన లేని లోటును జగన్ మాత్రమే తీర్చగలరన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయకముందు నుంచీ తాను జగన్ వెంట ఉంటున్నా అని చెప్పారు.
తాజా కథనాలను మేకపాటి కొట్టిపారేశారుగానీ… అసలు అంశాల గురించి మాట్లాడలేదు. ఈసారి మేకపాటి గెలుపు అనుమానమే అంటూ వైకాపా అంతర్గత సర్వేల్లో తేలిందనీ, అదే విషయాన్ని జగన్ కూడా పార్టీ వర్గాలతో చెప్పారని, అందుకే మేకపాటి అసంతృప్తితో ఉన్నారనేది కదా తాజా కథనాల సారాంశం. ఆ సర్వేల గురించిగానీ, మేకపాటి కుటుంబ సభ్యులకు ఈసారి టిక్కెట్లు సంగతి ఏంటనేదిగానీ ఆయన మాట్లాడలేదు. వాస్తవానికి, ఒకప్పుడు వైకాపా తరఫున ఢిల్లీలో నాయకుడు ఎవరంటే… మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నట్టుగా ఉండేది. ఇతర జాతీయ పార్టీలతో ఆయనే బాగా టచ్ లో ఉండేవారు. అయితే, ఎంపీ విజయసాయి రెడ్డి తెర మీదికి రావడం… ఢిల్లీ వ్యవహారాలన్నీ తానే నడిపిస్తున్నా అన్నట్టుగా పార్టీలో వ్యవహరించడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ మేకపాటిలో కొంత అసంతృప్తి మొదలైందని అంటారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామా వ్యవహారంలో కూడా విజయసాయి రాజీనామా చేయకపోవడంపై మేకపాటి స్పందన వేరేగా ఉందనీ అప్పట్లో అనుకున్నారు. భాజపాకి జగన్ దగ్గరౌతున్నట్టు సంకేతాలు ఇవ్వడం మొదట్నుంచీ మేకపాటి ఇష్టం లేదనే అంటారు. ఇవన్నీ చాన్నాళ్లుగా వినిపిస్తున్న కథనాలే. వైకాపాకి మేకపాటి దూరమౌతారా లేదా అనే ఇప్పుడు ప్రధానమైన అంశం కాకపోయినా, ఆయన ఎప్పట్నుంచో కొంత అసంతృప్తిగానే పార్టీలో కొనసాగుతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఆ అసంతృప్తికి గల కారణాలు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి.