తెలుగు మీడియాలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు లాబీ ఎంత బలంగా వుందంటే ఆయనే స్వయంగా లేదన్న వద్దన్న విషయాలను కూడా వారు వదలిపెట్టరు. మొదట ఆయన రాష్ట్రపతి అభ్యర్థి అన్నట్టు సంకేతాలిచ్చి సర్దుకున్నారు. తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఖాయమన్నారు. నేను ఉషాపతినే గాని ఉపరాష్ట్రపతిని కాదని ఆయన పదేపదే ఖండించినా వీరు మాత్రం ఉత్సాహంగా కథనాలు వదులుతూనే వున్నారు. బిజెపి అంతర్గత వర్గాలతో మాట్లాడితే ఆ సమస్య లేదని తేల్చిచెబుతున్నారు. ఆఖరుకు వెంకయ్య స్వయంగా తనకు అలంకార ప్రాయమైన ఆ పదవిపై ఆసక్తిలేదని కరాఖండిగా చెప్పారు. ప్రజలు దూరంగా వుండబోనన్నారు. రాష్ట్రపతి పదవి రాజ్యాంగహౌదా కాగా ఉపరాష్ట్రపతి కేవలం అలంకారమే. రాజ్యసభకు అద్యక్షత అన్నది వున్నా వాస్తవంలో వైస్‌ఛైర్మన్ ఎక్కువగా నడుపుతుంటారు. అందులోనూ వాగ్ధాటికి వాదవివాదాలకు మారుపేరైన వెంకయ్య వంటివారు అక్కడ మౌనంగా కూచోవడం వూహకందని విషయం. ఉపరాష్ట్రపతులలో కొందరే తర్వాత రాష్ట్రపతులైనారు గాని కొందరు అనామకంగా దిగిపోయారు. ఇవన్నీ తెలుసు గనకే వెంకయ్య అనాసక్తి ప్రకటించారు. అయినా ఆ పేరు పదేపదే ప్రచారం చేసి పరవశించే లాబీ వూరుకోదు కదా.. ఇప్పుడు కూడా ఆయన పేరు ప్రతిపాదనకు వచ్చిందంటూనే ఒప్పుకోబోరని ముక్తాయింపు నిస్తున్నారు. స్వయంగా ఆయనే ప్రధాని మోడీకి ఈ విషయం చెబుతారని కూడా కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. కాబట్టి వారి వూహాగానాలను వారే కొట్టిపారేస్తున్నారని స్పష్టం అవుతున్నది. అయినా ఆ స్థాయిలో ఆయన పేరు వినిపించాలనే వారి ముచ్చట.ఆరెస్సెస్ ఆదేశించి అనివార్యమైతే తప్ప వెంకయ్య ఈ మొక్కుబడి పదవిలోకి రారు.
అయితే ఉత్తరాదికి చెందిన దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశారు గనక దక్షిణాది నుంచి ఎవరైనా అగ్రవర్ణ నాయకుడిని ఎంపిక చేయాలనేది ఆరెస్సెస్ ప్రతినిధులు బిజెపి అద్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చిన ఆదేశం. ఆ కోణంలోనే తెలంగాణ నేత ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును ఎన్నుకునే అవకాశముందని కొన్ని వార్తా సంస్థలు గతంలో వెల్లడించాయి. ఆయన మొదటి నుంచి ఆరెస్సెస్ లో పనిచేసిన వ్యక్తి, వివాద రహితుడుగా భావిస్తున్నారట. పైగా ఎపిలో కన్నా తెలంగాణలో తమకు మెరుగైన అవకాశాలుంటాయన్నది బిజెపి వ్యూహం. తెలంగాణ ఇచ్చిన కారణంగా కాంగ్రెస్‌కు మొగ్గు వుంటుందని మొదట భావించిన మోడీ ఎపిపై దృష్టి పెట్టారు. తర్వాత అది మారిపోయింది. ఎపిలో టిడిపి శక్తివంతమైంది వైసీపీ కూడా బలంగా వుంది గనక తమకు తెలంగాణలోనే అవకాశాలు ఎక్కువన్న భావన బిజెపిలో వుంది. ఆ విధంగా చూస్తే విద్యాసాగర్‌ను ఎంపిక చేసినా చేయొచ్చు.