రాజమౌళి ఓ సినిమా తీస్తున్నాడంటే.. అందరి దృష్టీ అటు వైపే ఉంటుంది. అందులోనా అది మల్టీస్టారర్ అయితే.. కళ్లు ఇంకా పెద్దవి చేసుకుని చూస్తుంటారు. ఆ మల్టీస్టారర్లో రామ్చరణ్, ఎన్టీఆర్లు ఉంటే ఇక చెప్పేదేముంది? ఈ సినిమా గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. కానీ వీటి చుట్టూ బోలెడన్ని రూమర్లు పుట్టుకొచ్చేశాయి. ఈ సినిమా కథ ఇదంటూ కొన్ని కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ అని కొన్ని రోజులు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇది పోలీస్ స్టోరీ అంటున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోలీసులుగా కనిపిస్తారన్న టాక్నడుస్తోంది. దీనికి తోడు చాలా టైటిళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓ కొత్త టైటిల్ వినిపిస్తోంది. అదే… `టార్గెట్` అట! ‘స్టూడెంట్ నెం.1’ని మినహాయిస్తే.. ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన దాఖలా ఒక్కటీ లేదు రాజమౌళి కెరీర్లో. ఈసారి.. ఇద్దరు పవర్ ఫుల్ హీరోల్ని పెట్టుకుని ఓ పాత టైటిల్ని వాడతాడని ఎవరు ఊహిస్తారు? పైగా ‘టార్గెట్’ అనే పేరుతో ఓ సినిమా వచ్చి, ఫ్లాప్ అయ్యింది. ఆ విధంగా చూసినా… ఈ టైటిల్ కూడా ఓ రూమరే అనిపిస్తోంది. రాజమౌళి పీఆర్లు కూడా.. ‘ఇంకా కథే సెట్ కాలేదు.. అప్పుడే టైటిల్ ఎలా బయటకు వస్తుంది’ అన్నట్టు మాట్లాడుతున్నారు. అదీ కథ…