హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జయ బయట కనిపించిందిలేదు. ప్రమాణ స్వీకారంనాడుకూడా నడవటానికి ఇబ్బందిగా పడ్డట్లు కనిపించారు. ఆ తర్వాత సెక్రటేరియట్‌కు రెండుసార్లుమాత్రమే వచ్చారు. ఇక క్యాబినెట్ సమావేశం ఒక్కసారికూడా జరగలేదు. గత నెలలో ప్రారంభమైన చెన్నై మెట్రోనుకూడా ఆమె నేరుగా హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా, జయ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, కిడ్నీగానీ, లివర్గానీ దెబ్బతిని ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా డీఎమ్‌కే అధినేత కరుణానిధి జయపై దాడి ప్రారంభించారు. ఆమె విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, ముఖ్యమంత్రిస్థాయివ్యక్తి పారదర్శకంగా ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయలలితకు ఏమైనా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపుచేయటం ఎలారా బాబూ అని తమిళనాడు పోలీసులు భయంతో వణికిపోతున్నారట!