ఈ రోజుల్లో సినిమాకి రన్ టైం చాలా కీలకం. కంటెంట్ బావున్నా.. సాగదీసిన ఫీలింగ్ కలిగితే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇంకా కాసేపు వుంటే బావున్నాను అనే ఫీలింగ్ తోనే ప్రేక్షకులని తృప్తి పరచడం మంచి ఆలోచన. ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఈ లెక్కని పాటించింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సరిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం 2గంటల నాలుగు నిముషాలు. చాలా క్రిస్ప్ రన్ టైం ఇది.
120నిమిషాల రన్ టైంని ఐడియల్ రన్ టైం గా ఫిల్మ్ డాటా నిపుణులు చెబుతుంటారు. ఆపరేషన్ వాలెంటైన్124… అంటే ఐడియల్ టైంని మ్యాచ్ చేసినట్లే. పుల్వామా దాడి, దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీర్చుకున్న ప్రతీకారం నేపధ్యంలో వస్తున్న సినిమా ఇది. హిందీలో ఇదే కథతో ఇటివల ఫైటర్ సినిమా వచ్చింది. తెలుగులో మాత్రం ఇలాంటి ఏరియల్ యాక్షన్ రావడం ఇదే మొదటి సారి. చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడంతో మరింత బజ్ పెరిగింది. ఫిబ్రవరిలో సరైన సినిమాలేక బాక్సాఫీసు డీలా పడింది. మార్చి 1న వస్తున్న ఈ సినిమా హిట్ బిగినింగ్ ఇస్తుందేమో చూడాలి.