ఆనందీ బెన్ పటేల్ కు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి ఊరట లభించడం ఖాయమైంది. నవంబర్లో 75 ఏళ్లు నిండుతున్న తనకు రాజీనామా చేయడానికి అనుమతించాలని ఆమె పార్టీ అధ్యక్షుడిని కోరారు. దీంతో, గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిపై పార్టీ జాతీయ నాయకత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుత మంత్రి విజయ్ రూపానీకి అవకాశం దక్కవచ్చని గుజరాత్ లో అప్పుడే ప్రచారం జరుగుతోంది. ఆనందీబెన్ ది స్వచ్ఛంద పదవీ విరమణ కాలేదని, పార్టీయే ఇలా గౌరవంగా సాగనంపుతోందని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆనందీ బెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ అత్యంత ప్రజాదరణ పొందారు. భూకంపం సంభవించిన తర్వాత సత్వరం సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత గుజరాత్ ను వివిధ రంగాల్లో అమలు చేసిన ముఖ్యమంత్రిగా ఖ్యాతి పొందారు. ముఖ్యమంత్రి అయిన రెండేళ్లక రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించి దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.
అలాంటి మోడీ తర్వాత సీఎం కావడమే ఆనందీబెన్ కు శాపమైందంటారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచీ ఆమెను మోడీతో పోల్చడం మొదలైంది. అయితే పటేల్ ఆందోళన, దళితుల తదితర అంశాలు ఆమెకు మైనస్ పాయింట్లుగా మారాయి. మొత్తానికి ఆమె గద్దె దిగడం ఖాయమైంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
రాజ్ కోట్ కు చెందిన 59 ఏళ్ల రూపానీకే అవకాశం దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. మరికొందరు నాయకుల పేర్లు కూడా వినపడుతున్నాయి. అయితే, ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టిలో రూపానీకి మంచి మార్కులే పడ్డాయని ఆయన అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుత మంత్రుల్లో మంచి పరిపాలన దక్షుడు అతడే అనేది మోడీ, అమిత్ షా ఉద్దేశమని అప్పుడే కొన్ని చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త ముఖ్యమంత్రికి తగినంత సమయం ఉంటేనే సత్తా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రిపై బీజేపీ నిర్ణయం తీసుకోవచ్చు.
అన్నట్టు… ఆగస్టు 2 రూపానీ పుట్టిన రోజు. ఆయనకు పుట్టిన రోజు కానుకగా సీఎం పదవి దక్కవచ్చని రూపానీ సన్నిహితులు చెప్తున్నారు.