కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారి ఓట్లు వేయిస్తామంటూ తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకుని రంగంలోకి దిగిపోయారు. ఏపీ తరపున సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారబరిలోకి దిగారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో బండి సంజయ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. చిక్ బళ్లాపూర్, కోలార్, బెంగళూరు వంటి చోట్ల ఏపీ బీజేపీ నేతలు తిరుగుతున్నారు.
కర్ణాటకలో ఈసారి బీజేపీకి గడ్డు పరిస్థితి ఉంది. బీజేపీకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రావడం లేదు. జాతీయ సర్వేలు కాంగ్రెస్ కు… లోకల్ సర్వేలు హంగ్ అని అంచనాలు వేస్తున్నాయి. అయితే.. దక్షిణాదిలో అధికారం ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా నిలబెట్టుకోకపోతే… వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు చాలా డేంజర్ అవుతుందన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో కర్ణాటక అగ్రనాయకత్వం ఉంది.
తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ మొదటి నుంచి బలహీనంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో అతి తక్కువ సీట్లు వస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. వైసీపీ సపోర్ట్ చేసింది. ఈ సారి తెలంగాణ పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే తెలుగు నేతల హడావుడేకానీ.. వీరి ప్రచారం వల్ల మారేదేమీ ఉండదని.. కర్ణాటకలో ఉన్న పరిస్థితుల్ని బట్టే అక్కడ ప్రజలు ఓట్లేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.