ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అంటూ బీజేపీ నేతల చేస్తున్న హడావుడి చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో ఎక్కడా కవిత పేరు ప్రస్తావించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కేంద్రం హైదరాబాద్ అని.. మనీష్ సిసోడియా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లి చర్చలు జరిపి డీల్ కుదుర్చుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. నేరుగా కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు.
నిజంగా ఇలాంటిదేమైనా ఉంటే.. సీబీఐ దర్యాప్తులో తేలుతుంది. బీజేపీ నేతల దగ్గర ఖచ్చితమైన సమాచారం ఏదైనా ఉంటే.. ముందుగా సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకుంటే నమ్మశక్యంగా ఉంటుంది కానీ..బీజేపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా రాజకీయమనే అనుకుంటారు. బీజేపీ నేతలు చెప్పిన విషయాల్నే రేపు తాము దర్యాప్తులో కనుగొన్నామని సీబీఐ అధికారులు ప్రకటిస్తే.. చాలా మందికి సందేహాలు వస్తాయి. బీజేపీ నేతలు చెప్పిందే సీబీఐ చెబుతోందని విమర్శలు వస్తాయి.
ఒక వేళ సీబీఐ ఆ ఆరోపణలు చేయకపోతే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసినట్లు ప్రజలు నమ్ముతారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసి కూడా బీజేపీ నేతలు ఎందుకు కవితపై ఆరోపణలను హైలెట్ చేస్తున్నారన్నది చర్చనీయాంశం మారింది. రాజకీయంగా కేసీఆర్పై ఒత్తిడి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.