కరోనా కాస్త నెమ్మదించిందనుకుంటే రష్యా ప్రపంచానికి వైరస్‌లా పట్టుకుంటోంది. ఉక్రెయిన్ విషయంలో లేనిపోనివి ఊహించుకుని ఆ దేశంపై రాత్రికి రాత్రి యుద్ధం ప్రకటించేసింది. ఫలితంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా ఆ ఎఫెక్ట్ అందరిపై పడుతోంది. ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద కరిగిపోతోంది. మరో వైపు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉక్రెయిన్ లో ప్రభుత్వాన్ని మార్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని దాడులు చేస్తామని పుతిన్ చెబుతున్నారు. ఉక్రెయిన్ కూడా ప్రతిఘటిస్తోంది.
కానీ రష్యా బలం ముందు దాని బలం కొద్దిగే. కానీ నాటో దేశాలు చూస్తూ ఉరుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో అమెరికా రష్యాపై ప్రతి దాడులకు వ్యూహరచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఉక్రెయిన్‌తో తమ గొడవల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదిలి పెట్టబోమని పుతిన్ చెబుతున్నారు. జోక్యం చేసుకోకపోయినా ఆయన చర్యల వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా ఈ విషయంలో ఇప్పుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోయినా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే సందు అనుకుని .,. చైనా లాంటి దేశాలు తైవాన్ వంటి వాటిని ఆక్రమించుకుంటే మొత్తానికి గందరగోళం ఏర్పడుతుంది. ప్రపంచం అంతా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది.
రష్యా ఇప్పుడే్ యుద్ధం ప్రారంభించింది. పరిస్థితి విషమించకముందే దీన్ని ఆపేస్తే ఎంతో కొంత నష్టంతో బయటపడారు. కానీ ఈ వివాదంలోకి నాటో దేశాలు కూడా ఎంటర్ అయి .. ఒకరిపై ఒకరు దాడులు ప్రారంభిస్తే జరిగేదవి వినాశనమే. యుద్ధం కారణంగాపెద్ద ఎత్తున తెలుగువారు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఉక్రెయిన్ యూనివర్శిటీల్లో ఎంబీబీఎస్ చదివే తెలుగు వారు వందల మంది ఉన్నారు. వారంతా అక్కడ ఇరుక్కుపోయారు. వారిని తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి.