రష్యాకు చెందిన ఎయిర్ బస్ ఏ-321 విమానం ఒకటి ఈజిప్టులోని సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో ఈరోజు కూలిపోయింది. విమానంలో మొత్తం 224మంది ప్రయాణికులు, 7మంది విమాన సిబ్బంది ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో అందరూ మరణించినట్లు భావిస్తున్నారు. దీనిని ఐసిస్ ఉగ్రవాదులు కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ విమానం (నెంబర్: 9268) స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 06:51గంటలకు ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుండి బయలుదేరి, రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల పుల్కొవ్ విమానాశ్రయానికి 12:10 గంటలకు చేరుకోవలసి ఉంది. కానీ విమానం బయలుదేరిన 23నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా దాడులు చేస్తోంది. అందుకు ప్రతీకారంగానే ఐసిస్ ఉగ్రవాదులు విమానాన్ని కూల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిపోయినట్లు ఈజిప్ట్ ప్రధాని కార్యాలయం ద్రువీకరించింది. రష్యా కూడా ద్రువీకరించింది. కానీ దానిని ఐసిస్ ఉగ్రవాదులు కూల్చారా లేక వేరేదయినా కారణం చేత కూలిపోయిందా..? అనే విషయాన్ని ఎవరూ దృవీకరించలేదు.