224మంది ప్రయాణీకులతో కూడిన రష్యా విమానం ఈజిప్ట్ కొండప్రాంతంలో కూలిపోవడంతో ఏ ఒక్కరూ కూడా సజీవంగా బ్రతికే అవకాశం లేదన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన పరిస్థితుల్లో ఇప్పుడు మరో నమ్మలేని వార్త వెలుగుచూసింది. ఈజిప్ట్ కి అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎం) అనే ఉగ్రవాద సంస్థ ఈ విమానం కూల్చిందే తామేనంటూ స్వయబాధ్యతను ప్రకటించుకోవడం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. రష్యా అధికారులు మాత్రం ఇదంతా వదంతులేనంటూ కొట్టిపారేసినా, ఐఎస్ దళాలు ఈపని చేశాయని చెప్పడానికి కొద్దిపాటి ఆధారాలు కనిపించకపోలేదు. శనివారం రాత్రి ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మద్దతుదారులు ట్వీట్ చేయడంతో వివాదాస్పదమైన వదంతులు వ్యాపించడం మొదలయ్యాయి.
అయితే, శనివారం ఉదయం విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమంటూ ఈజిప్ట్ భద్రతా దళాలు చెప్పుకొచ్చాయి. ఐఎం బాధ్యత ఉన్నదంటూ ట్వీట్స్ లోనే కాకుండా, ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వార్తలను ఎంతోకొంత అధికారికంగానైనా అందించే ఒక వెబ్ సైట్ లో కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో వదంతులకు బలం చేకూరినట్లయింది.
విమాన సిబ్బంది, ప్రయాణీకులతో వెళుతున్న రష్యన్ విమానాన్ని సినాయ్ ప్రావెన్సీ పర్వతశ్రేణుల ప్రాంతంలో ఇస్లామికి స్టేట్ కి చెందిన దళాలు కూల్చివేశాయనీ, వారంతా చనిపోయారనీ, భగవంతుడికి ధన్యవాదాలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
అయితే ఈ వార్తలను రష్యా తీవ్రస్థాయిలో ఖండిస్తోంది. వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ బస్-321 విమానం సినాయ్ కోస్టల్ రిసార్ట్ ఎల్ షేక్ నుంచి రష్యాలోని పీటెర్స్ బర్గ్ కు బయలుదేరిన 23 నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం కూల్చివేతకు టెర్రరిస్టులతో సంబంధం లేదని రష్యా ట్రాన్స్ పోర్ట్ మంత్రి చెబుతున్నారు. విమానం కూలిపోయే సమయంలో అది 30వేల అడుగుల ఎత్తులో ఉంది. కేవలం సాంకేతిక లోపాల కారణంగానే విమానం కూలిపోయిందని, దీనిలో మానవ సంబంధం లేదని రష్యా భావిస్తోంది. ఒకవేళ ఎవరైనా కూల్చివేసిఉంటే , అది ఏ రకంగాజరిగిందన్న ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడంలేదన్నది రష్యా వాదన. ఐఎస్ ఉగ్రవాదుల పనేనని నిర్ధారించడానికి ఏమాత్రం నమ్మశక్యం కావడంలేదని వారు అంటున్నారు.
పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత ప్రమాదకారణం బయటపెడతామని చెబుతున్నారు. అంతవరకూ ఈ సంఘటనపై వివాదాస్పదమైన వదంతులు నమ్మవద్దని రష్యా ప్రభుత్వం కోరుతోంది. ప్రమాదమా, లేక ఉగ్రవాదుల పనా ? అన్నది త్వరలోనే తేలుతుంది.