జగిత్యాలలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయిలు తమని పట్టించుకోవడం లేదన్న కోపంతో – వాళ్లిద్దరూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆ శరీరాలు కాలి బూడిదయ్యాయి. అయితే… ఈ ఆత్మహత్యల వెనుక ఆర్ ఎక్స్ 100 సినిమా ప్రభావం ఉందని ప్రాధమిక విచారణలో తేలింది. ఆ సినిమాలో హీరోలానే తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారని పోలీసులు నిర్దారించారు. `ఆర్.ఎక్స్ 100 ప్రభావంతో విద్యార్థుల ఆత్మహత్యలు` అంటూ మీడియా కూడా పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తల్ని ప్రసారం చేసింది.
దీనిపై దర్శకుడు అజయ్ భూపతి స్పందించాడు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… `చనిపోయింది విద్యార్థులు. ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండలేదు. నేను వాళ్ల కోసం ఆర్.ఎక్స్ 100 సినిమా తీయలేదు. అది పూర్తిగా A సర్టిఫికెట్ సినిమా. అలాంటి సినిమాలకు 18 ఏళ్లు నిండనివాళ్లకు అనుమతి లేదు. వాళ్లని అస్సలు థియేటర్లలోపలికే అనుమతించకుండా చూడాల్సింది“ అంటూ తెలివైన స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమాల ప్రభావం యువతరంపై తప్పకుండా ఉంటుంది. కానీ అది కొంతవరకే. మంచి చూసి నేర్చుకోరుగానీ, చెడు మాత్రం వాళ్లపై ప్రభావం చూపిస్తుంది. కానీ సినిమా చూసి ఆత్మహత్యలు చేసుకోవాలన్నంత స్థాయిలో కాదు. అజయ్ భూపతి కామెంట్ కూడా ఇదే.